సూత్రధారి.. సుబ్బారావే

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన విధ్వంసం సూత్రధారి ఆవుల సుబ్బారావు అని రైల్వే పోలీసులు తేల్చారు. అగ్నిపథ్‌ ద్వారా సైన్యంలో నియామకాల ప్రక్రియ మొదలైతే డిఫెన్స్‌ అకాడమీలు మూతపడే ప్రమాదం ఉందని భావించే ఈ కుట్ర పన్నినట్టు

Updated : 26 Jun 2022 07:20 IST

అకాడమీలు మూతపడతాయనే సికింద్రాబాద్‌ స్టేషన్‌లో విధ్వంసం

రిమాండ్‌ రిపోర్టులో రైల్వే పోలీసులు

ఈనాడు, హైదరాబాద్‌, రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన విధ్వంసం సూత్రధారి ఆవుల సుబ్బారావు అని రైల్వే పోలీసులు తేల్చారు. అగ్నిపథ్‌ ద్వారా సైన్యంలో నియామకాల ప్రక్రియ మొదలైతే డిఫెన్స్‌ అకాడమీలు మూతపడే ప్రమాదం ఉందని భావించే ఈ కుట్ర పన్నినట్టు నిర్ధారించారు. అతడిపై హత్యాయత్నం, అనుమానాస్పద మృతితోపాటు ఐపీసీ 143, 324,347 సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. ఈ కేసులో ఏ-64 సుబ్బారావు సహా అతని అనుచరులు మల్లారెడ్డి, శివకుమార్‌, బీసీరెడ్డిలను శనివారం అరెస్టుచేసి, బోయిగూడలోని రైల్వే కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. ‘‘బీసీరెడ్డి, మల్లారెడ్డి, శివకుమార్‌లు స్వయంగా ఆందోళనల్లో పాల్గొన్నారు. ఆందోళనకారుల్లో కొందరికి రూ.35 వేల చొప్పున నగదు కూడా ఇచ్చారు. టీవీల్లో ప్రసారమవుతున్న విధ్వంస దృశ్యాలను చూసిన తర్వాత సుబ్బారావు హైదరాబాద్‌ నుంచి పరారయ్యాడని’ సికింద్రాబాద్‌ రైల్వే ఎస్పీ అనూరాధ ఓ ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు నలుగుర్నీ కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుంటామన్నారు. ఎస్పీ ప్రకటన, రిమాండ్‌ రిపోర్టు ప్రకారం..

మూడేళ్లలోనే ఆరు అకాడమీల స్థాపన

‘‘పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన ఆవుల సుబ్బారావు ఆర్మీలో నర్సింగ్‌ అసిస్టెంట్‌గా పనిచేసి 2011లో బయటకు వచ్చాడు. నరసరావుపేటలోని రామిరెడ్డిపేటలో 2014లో సాయి డిఫెన్స్‌ అకాడమీ ప్రారంభించాడు. తర్వాత రెండు, మూడేళ్లలోనే హైదరాబాద్‌ బోడుప్పల్‌ సహా తెలుగు రాష్ట్రాల్లో ఆరు అకాడమీలు నెలకొల్పాడు. ఆర్మీ నియామకాల్లో భాగంగా జరిగే దేహదారుఢ్య, వైద్య పరీక్షల్లో అర్హత సాధించిన వారి వివరాలను సహాయకుల ద్వారా తెలుసుకునేవాడు. విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు తన దగ్గర ఉంచుకుని ఉచితంగా శిక్షణ ఇచ్చేలా, ఉద్యోగం వచ్చాక రూ.3 లక్షలు ఇస్తే సదరు పత్రాలు తిరిగిచ్చేలా అభ్యర్థులతో ఒప్పందం కుదుర్చుకునేవాడు.

ప్రవేశ పరీక్షలు రద్దవడంతో...

2019లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలు జరిగాయి. ఇందులో దేహదారుఢ్య, వైద్య పరీక్షలకు ఎంపికైన మూడు వేల మంది ఉమ్మడి ప్రవేశపరీక్ష రాసేందుకు సాయి డిఫెన్స్‌ అకాడమీ సహా ఇతర అకాడమీల్లో శిక్షణ తీసుకున్నారు. ప్రవేశ పరీక్ష వాయిదా పడటంతో దాన్ని నిర్వహించాలంటూ అకాడమీల ఆధ్వర్యంలో ఆర్మీ అభ్యర్థులు సైన్యాధికారులకు అనేకసార్లు వినతిపత్రాలు అందజేశారు. ఈ నెల 14న కేంద్రం అగ్నిపథ్‌ పథకాన్ని ప్రకటించడం, ఉమ్మడి ప్రవేశ పరీక్ష రద్దు చేస్తున్నట్టు వెల్లడించడంతో నిరాశకు లోనయ్యారు.

రెచ్చగొట్టడం వల్లే..

అందుకు నిరసనగా ఆర్మీ అభ్యర్థులు జూన్‌ 17న సికింద్రాబాద్‌లోని ఆర్మీ నియామక కార్యాలయం(ఏఆర్‌వో) వరకూ ర్యాలీగా వెళ్లాలని అనుకున్నారు. చలో సికింద్రాబాద్‌ తదితర పేర్లతో వాట్సప్‌ గ్రూప్‌లు ఏర్పాటుచేసి సందేశాలు పంపారు. హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌లలో హింసాత్మక ఘటనలు జరగడం..సుబ్బారావు, ఇతరులు రెచ్చగొట్టడంతో వ్యూహం మార్చుకున్నారు. రైల్వేస్టేషన్‌ బ్లాక్‌, ఇండియన్‌ ఆర్మీ, హకీంపేట్‌ ఆర్మీ సోల్జర్‌ పేర్లతో మరికొన్ని వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటుచేసుకుని సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు రావాలంటూ సందేశాలు పంపించారు. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు సుబ్బారావు 16న నరసరావుపేట నుంచి హైదరాబాద్‌ వచ్చాడు. బోడుప్పల్‌లోని ఎస్‌వీఎం గ్రాండ్‌ లాడ్జిలో బసచేశాడు. ‘ఆవుల సుబ్బారావు హైదరాబాద్‌కు వచ్చాడని, మనకు మద్దతిస్తున్నాడంటూ’ ఆయనతో దిగిన ఫొటోను ఆయన అనుచరుడు శివకుమార్‌ హకీంపేట ఆర్మీ సోల్జర్స్‌ గ్రూపులో పోస్ట్‌ చేశాడు.


వేగంగా రండి.. రైళ్లను తగలబెట్టండి

ఆర్మీ ఉద్యోగాలను కోరుకునేవారంతా సికింద్రాబాద్‌కు వచ్చేలా చూడాలని, ఆందోళనకారులను ప్రోత్సహించి రైల్వేస్టేషన్‌లో అలజడి సృష్టించాలని అనుచరులైన మల్లారెడ్డి, శివకుమార్‌, బీసీరెడ్డిలను సుబ్బారావు ఆదేశించాడు. బ్యానర్లు, ఇతర సరంజామా సమకూర్చేందుకు భరత్‌ అలియాస్‌ రెడ్డప్ప(గతంలో అరెస్టయ్యాడు) ద్వారా వారికి డబ్బు సమకూర్చాడు. ఆందోళనను పర్యవేక్షించేందుకు బీసీరెడ్డిని, ఆర్మీ అభ్యర్థులను ప్రోత్సహించేందుకు శివకుమార్‌, మల్లారెడ్డిలను స్టేషన్‌ లోపలికి పంపించాడు. వాళ్లంతా రైళ్లు తగలబెట్టాలంటూ ఆందోళనకారులను రెచ్చగొట్టారు. విధ్వంస సమయలో శివకుమార్‌ మీడియాతోనూ మాట్లాడాడు. వీటన్నింటినీ లాడ్జి నుంచి సుబ్బారావు పర్యవేక్షించాడు. పోలీసులకు దొరక్కుండా వాట్సప్‌ గ్రూపుల్లో సందేశాలను తొలగించాడు. తర్వాత గుంటూరుకు పారిపోయాడు’’ అని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని