దివ్యాంగ సచివాలయ ఉద్యోగిపై వైకాపా నాయకుడి దాడి

శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలోని ఓ వైకాపా నాయకుడు దివ్యాంగుడైన సచివాలయ ఉద్యోగిపై అందరూ చూస్తుండగానే విచక్షణరహితంగా దాడి చేశాడు. పిడిగుద్దులు గుద్దుతూ, తన్నుతూ వీరంగం సృష్టించాడు.

Published : 26 Jun 2022 07:47 IST

తెదేపా వారికి పింఛను ఎందుకిచ్చావంటూ వీరంగం

నందిగాం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలోని ఓ వైకాపా నాయకుడు దివ్యాంగుడైన సచివాలయ ఉద్యోగిపై అందరూ చూస్తుండగానే విచక్షణరహితంగా దాడి చేశాడు. పిడిగుద్దులు గుద్దుతూ, తన్నుతూ వీరంగం సృష్టించాడు. తెదేపాకు చెందిన వారికి పింఛను మంజూరు చేశారనే కోపంతో శనివారం ఈ దాడికి పాల్పడ్డాడు. కవిటి అగ్రహారం గ్రామసచివాలయానికి స్థానిక సర్పంచి భర్త, వైకాపా నాయకుడు బొమ్మాళి గున్నయ్య వచ్చి తనకు తెలియకుండా తెదేపావారికి పింఛన్లు ఎందుకిచ్చావంటూ అక్కడే ఉన్న డిజిటల్‌ అసిస్టెంట్‌ కరుకోల వాసుదేవరావును ప్రశ్నించాడు. అర్హులైన వారికే ఇచ్చామంటూ సమాధానం చెబుతుండటంతో కోపోద్రిక్తుడైన గున్నయ్య వాసుదేవరావుపై విరుచుకుపడ్డాడు. అక్కడున్న ఉద్యోగులు, స్థానికులు అడ్డుకున్నా ఆగలేదు. అనంతరం విధులు ముగించుకొని వాసుదేవరావు స్వగ్రామం వెళుతుండగా.. రైలుపట్టాల వద్ద మరోసారి గున్నయ్య తోసేశాడు. సమాచారం అందుకున్న మండలంలోని 22 గ్రామ సచివాలయాల ఉద్యోగులు వాసుదేవరావుపై దాడిని నిరసిస్తూ స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఎంపీడీవో ఫణీంద్రకుమార్‌కు ఫిర్యాదు చేశారు. దివ్యాంగ ఉద్యోగిపై గున్నయ్య చేయి చేసుకోవడం దారుణమని ఎంపీడీవో పేర్కొన్నారు. గతంలో కూడా అనేకసార్లు తనను దివ్యాంగుడివంటూ గున్నయ్య దూషించాడని, ఉన్న కాలు విరగ్గొడతానని హెచ్చరించాడని బాధిత ఉద్యోగి వాసుదేవరావు ఆరోపించారు. దీనిపై వైకాపా మండల నాయకుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని స్థానిక సచివాలయ ఉద్యోగులు వాపోయారు. నిందితుడిని అరెస్టు చేయాలంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గున్నయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహమ్మద్‌ యాసిన్‌ తెలిపారు. దాడి చేసినట్లు ఆధారాలున్నా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోకపోవడంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని