కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. ఏడుగురి దుర్మరణం

కర్ణాటక రాష్ట్రం కుందానగరి బెళగావి వద్దనున్న కల్యాళ్‌పోల్‌ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదంలో కూలి పనులకు వెళ్తున్న ఏడుగురు మృతి చెందారు. గోకాక్‌ తాలూకా

Published : 27 Jun 2022 04:50 IST

బెళగావి, న్యూస్‌టుడే: కర్ణాటక రాష్ట్రం కుందానగరి బెళగావి వద్దనున్న కల్యాళ్‌పోల్‌ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదంలో కూలి పనులకు వెళ్తున్న ఏడుగురు మృతి చెందారు. గోకాక్‌ తాలూకా అక్కతంగియరహాళ్య గ్రామం నుంచి బెళగావికి క్రూజర్‌లో వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే ప్రయత్నంలో వంతెన పిట్టగోడను క్రూజర్‌ ఢీకొని కిందికి బోల్తాపడింది. వాహనంలో 21 మందికిపైగా కూలీలున్నట్లు తెలిసింది. ఏడుగురు అక్కడికక్కడే చనిపోగా, క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను అడివెప్ప చిలబాంవి (27), బవసరాజ్‌ దళవి (30), బసవరాజ్‌ హనుమన్నవర్‌ (51), ఆకాశగస్తి (22), గోకాక్‌ తాలూకా దాసనట్టి గ్రామానికి చెందిన ఫకీరప్ప హరిజన (55), మల్లప్ప దాసనట్టి (30), మల్లాపురకు చెందిన బసవరాజ్‌ సనది (35)గా గుర్తించారు. గాయాలైన 14మంది కూలీల్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. మారిహాళ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరంతా సాంబ్రా-సుళేబావి రైలు మార్గం మరమ్మతు పనులకు వెళ్తున్నట్లు తెలిసింది. మృతుల కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున పరిహారాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. క్షతగాత్రుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని హామీనిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని