Andhra News: పోలీసు వేధింపులే ప్రాణం తీశాయా!

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దళిత యువకుడు ఉదయగిరి నారాయణ(38) ఆత్మహత్యకు పోలీసు వేధింపులే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతడి దేహంపై

Updated : 27 Jun 2022 09:25 IST

దళిత యువకుడి ఆత్మహత్య కేసులో అనుమానాలు

పోస్టుమార్టం నివేదికలో గాయాల గుర్తింపు

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దళిత యువకుడు ఉదయగిరి నారాయణ(38) ఆత్మహత్యకు పోలీసు వేధింపులే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతడి దేహంపై గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వైద్యులు గుర్తించారు. కుడి భుజంపై వాచిన, కమిలిన గాయం, కుడి చెయ్యి బొటన వేలు దగ్గర మరో గాయం, రెండు అర చేతులపై, కుడి కాలి బొటన వేలిపై కమిలిన దెబ్బలు, కుడి మోకాలిపై గాయాలు ఉన్నాయని ఆ నివేదికలో ప్రస్తావించడం గమనార్హం. ఈ గాయాలకు పోలీసు దెబ్బలే కారణమని ప్రతిపక్షాలు, దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. నెల్లూరు రూరల్‌ మండలం కందమూరుకు చెందిన నారాయణ కూలీ పనులు చేసుకొని జీవించేవాడు. పొదలకూరు మండలంలో సిమెంట్‌ రాళ్ల వద్ద పనికి వెళ్లినప్పుడు అక్కడ దొంగతనం జరిగిందని ఆ యాజమాని వంశీనాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 18న నారాయణను  విచారణకు తీసుకొచ్చి వేధించారని అతని భార్య పద్మ ఆరోపించారు. పోలీసులు పదేపదే పిలుస్తుండటంతో తట్టుకోలేక 19వ తేదీన ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ పేరుతో పోలీసులు చిత్రహింసలే నారాయణ బలవన్మరణానికి కారణమని విపక్షాలతోపాటు దళిత సంఘాలు అప్పటి నుంచి ఆందోళన చేస్తున్నాయి. యువకుడి మృతికి కారణమవడంతోపాటు.. బాధిత కుటుంబాన్ని పోలీసులు భయపెట్టడం, వారి సంప్రదాయానికి విరుద్ధంగా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడంపై దళిత సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. పోస్టుమార్టం సమయంలో తీసిన వీడియోను ఎడిట్‌ చేసుంటారనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఛాతీ, మర్మాంగాలపై గాయాలున్నట్లు తాము చూశామని, ఆ వివరాలు బయటకు రాకుండా ఉండేందుకే నారాయణ మృతదేహాన్ని దహనం చేశారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని