దివ్యాంగ ఉద్యోగిపై దాడి కేసులో రాజీకి ప్రయత్నాలు!

శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం కవిటి అగ్రహారం గ్రామ సచివాలయంలో దివ్యాంగ ఉద్యోగిపై వైకాపా నాయకుడు దాడిచేసిన కేసును ఎలాగైనా రాజీ చేసేందుకు వైకాపా నాయకులు

Published : 27 Jun 2022 04:50 IST

నందిగాం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం కవిటి అగ్రహారం గ్రామ సచివాలయంలో దివ్యాంగ ఉద్యోగిపై వైకాపా నాయకుడు దాడిచేసిన కేసును ఎలాగైనా రాజీ చేసేందుకు వైకాపా నాయకులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో పోలీసులు ముఖ్యమైన సెక్షన్‌ ఇంతవరకూ నమోదు చేయలేదు. దివ్యాంగుడైన డిజిటల్‌ అసిస్టెంట్ కరుకోల వాసుదేవరావుపై ప్రభుత్వ కార్యాలయంలో శుక్రవారం అందరూ చూస్తుండగానే వైకాపా నాయకుడు బొమ్మాళి గున్నయ్య భౌతిక దాడికి దిగిన విషయం తెలిసిందే. కేసును నీరుగార్చేందుకే పోలీసులు సరైన సెక్షన్‌ పెట్టలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దివ్యాంగులపై ఎవరైనా దాడి చేస్తే వికలాంగుల హక్కుల చట్టం-2016లో 92(ఏ) సెక్షన్‌ కింద కేసు నమోదు చేస్తారు. కానీ ఎఫ్‌ఐఆర్‌లో ఐపీసీ 332, 506 సెక్షన్లు మాత్రమే పెట్టారు. మరోవైపు వైకాపా నాయకుడు, రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పేరాడ తిలక్‌ బాధితుడిని శనివారం పరామర్శించారు. రాజీకి రావాలని, కేసు వెనక్కి తీసుకోవాలంటూ ఆయన తనకు చెప్పారని బాధితుడు తెలిపారు. ఇదే అంశంపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని బాధితుడు, ఉద్యోగుల సంఘం నాయకులు కలిసి న్యాయం చేయాలని కోరారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ తప్పక న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అయితే.. నిందితుడు గున్నయ్యకు స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వలేదని.. అతడిపై సెక్షన్‌ 92(ఏ) కూడా చేర్చుతామని ఎస్సై మహమ్మద్‌ యాసిన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని