Crime News: రుణయాప్‌ సంస్థల ఆగడాలకు యువకుడి బలి

రుణ యాప్‌ సంస్థల ఆగడాలకు ఓ యువకుడు బలైపోయిన దారుణమిది. యువకుడు బతికే ఉన్నాడనుకొని, అతని సెల్‌ఫోన్‌కు ఇంకా మెసేజ్‌లు పంపడంతో ఆత్మహత్యకు కారణం బయటపడింది. పోలీసులు, బాధితుల కథనం మేరకు..

Updated : 28 Jun 2022 07:38 IST

కుటుంబసభ్యులకూ తప్పని వేధింపులు

కడియం, న్యూస్‌టుడే: రుణ యాప్‌ సంస్థల ఆగడాలకు ఓ యువకుడు బలైపోయిన దారుణమిది. యువకుడు బతికే ఉన్నాడనుకొని, అతని సెల్‌ఫోన్‌కు ఇంకా మెసేజ్‌లు పంపడంతో ఆత్మహత్యకు కారణం బయటపడింది. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. తూర్పుగోదావరి జిల్లా కడియం మండల కేంద్రానికి చెందిన కోనా సతీశ్‌(28) పీజీ చదివాడు. స్వతహాగా మృదుస్వభావి. తండ్రి పూలవ్యాపారి కాగా, తల్లి గృహిణి. సెల్‌ఫోన్‌లో చూసి చదువుల కోసమని ఓ లోన్‌యాప్‌లో కొంత రుణం తీసుకున్నాడు. తిరిగి చెల్లించాలంటూ యాప్‌ నిర్వాహకులు అతడిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. నగ్నంగా ఉన్న వేరే చిత్రానికి సతీశ్‌ తల అతికించి వాటిని ఇతరుల వాట్సప్‌ నంబర్లకు పంపించారు. ఆ విషయం తెలిసి సతీశ్‌ తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. ఈ నెల 24న సినిమాకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకెళ్లి, అదేరోజు రాత్రి భీమవరం సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం మరునాడు కుటుంబసభ్యులకు తెలిసింది. మరోవైపు అప్పు చెల్లించాలంటూ సతీశ్‌ కుటుంబసభ్యులకు ఈ నెల 26 నుంచి సెల్‌ఫోన్‌ సందేశాలు వస్తూనే ఉన్నాయి. మార్ఫింగ్‌ చేసిన సతీశ్‌ నగ్నచిత్రాలు సైతం పంపిస్తున్నారు. అప్పు కట్టకుంటే కుటుంబసభ్యుల ఫొటోలు కూడా అందరికీ పంపిస్తామని బెదిరిస్తున్నారు. దీంతో బాధిత కుటుంబం కడియం పోలీసులను ఆశ్రయించింది. దీనిపై ఫిర్యాదు అందిందని, దర్యాప్తు చేస్తామని కడియం సీఐ రాంబాబు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని