ఇద్దరు యువకుల సజీవ దహనం

రోడ్డుపై ఆగిపోయిన లారీని వెనుక నుంచి కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు సజీవదహనం అయ్యారు. కారు పల్టీలు కొట్టడంతో ఇంధన ట్యాంకు పగిలి మంటలు వ్యాపించటంతో దారుణం చోటుచేసుకుంది. నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌

Published : 28 Jun 2022 05:36 IST

 ఆగి ఉన్న లారీని ఢీకొని కారు దగ్ధం

నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద దారుణం

వేల్పూర్‌, కోరుట్ల, మెట్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: రోడ్డుపై ఆగిపోయిన లారీని వెనుక నుంచి కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు సజీవదహనం అయ్యారు. కారు పల్టీలు కొట్టడంతో ఇంధన ట్యాంకు పగిలి మంటలు వ్యాపించటంతో దారుణం చోటుచేసుకుంది. నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ క్రాస్‌రోడ్డు వద్ద సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన బెజ్జారపు సుమంత్‌(23), మెట్‌పల్లి మండలం వెల్లుల్లకు చెందిన మండలోజు అనిల్‌(26) బంధువులు. బయటకు వెళ్లొస్తానని చెప్పి రాత్రి 9గంటల సమయంలో సుమంత్‌ ఇంట్లో నుంచి బయలుదేరి, అనిల్‌తో కలిసి కారులో ఆర్మూర్‌ వైపు వెళ్లారు. వేల్పూర్‌ క్రాస్‌రోడ్డు వద్దకు రాగానే ఆగి ఉన్న లారీని వారి కారు ఢీకొంది. ప్రత్యక్ష సాక్షి అందించిన సమాచారంతో పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారు వచ్చి మంటలు ఆర్పేసరికి మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితికి చేరాయి. కారు నంబరు ఆధారంగా వివరాలు సేకరించారు. ప్రమాదంపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్‌కుమార్‌ తెలిపారు.

లారీలో పీడీఎస్‌ బియ్యం..

మెట్‌పల్లి నుంచి ధర్మాబాద్‌కు వెళ్తున్న లారీ వేల్పూర్‌ క్రాస్‌రోడ్డు వద్దకు రాగానే ఇంజిన్‌ సమస్యతో మొరాయించింది. వాహనం రోడ్డుపై ఆగిపోయినా.. ఆ డ్రైవర్‌ ఎలాంటి సూచికలు ఏర్పాటు చేయలేదు. దీంతో కారు దగ్గరకు వచ్చేవరకు లారీని గుర్తించలేకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. లారీలో 26 టన్నుల పీడీఎస్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

రెండు కుటుంబాల్లో పుత్రశోకం

అందివచ్చిన కుమారులు అగ్నికి ఆహుతవడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. మండలోజు లక్ష్మీనర్సయ్య, విజయ దంపతులకు కుమారుడు అనిల్‌తో పాటు ఇద్దరు కుమార్తెలు. తండ్రి స్థానికంగా చిన్న రైస్‌మిల్‌ నడుపుతుండగా, డిగ్రీ చదివిన అనిల్‌ మెట్‌పల్లిలో నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన బెజ్జారపు శ్రీనివాస్‌, మాధురి దంపతుల కుమారుడు సుమంత్‌ మహారాష్ట్రలోని నాసిక్‌లో బీఎస్సీ(డయాలసిస్‌ టెక్నాలజీ) కోర్సు చదువుతున్నాడు. ఏడాది కాలంగా హైదరాబాద్‌లోని మెడినొవా ఆసుపత్రిలో శిక్షణ పొందుతున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని