YSRCP Leaders: కర్రలు, రాళ్లతో మహిళలపై వైకాపా వర్గీయుల దాడి

అన్నమయ్య జిల్లాలోని రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో అధికార పార్టీకి చెందినవారు ఓ దారి వివాదంలో సామాన్యులపై విరుచుకుపడ్డారు. తమ పొలంలో దౌర్జన్యంగా

Updated : 29 Jun 2022 11:10 IST

దారి వివాదంలో విరుచుకుపడిన అధికార పార్టీ నాయకులు

పోలీసుల లాఠీ లాక్కుని మరీ దుశ్చర్య

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: అన్నమయ్య జిల్లాలోని రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో అధికార పార్టీకి చెందినవారు ఓ దారి వివాదంలో సామాన్యులపై విరుచుకుపడ్డారు. తమ పొలంలో దౌర్జన్యంగా రోడ్డు వేశారని ఓ వర్గంవారు చెప్పడంతో అధికార పార్టీకి చెందిన మరో వర్గంవారు మాకూ ఇక్కడే రోడ్డు ఉందంటూ వివాదానికి తెర తీశారు. అధికార పార్టీ వర్గీయులు మరో వర్గానికి చెందిన మహిళలపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. గ్రామంలోని రాజమ్మకు చెందిన భూమిలో ఆదివారం అధికార పార్టీకి చెందిన ఓ వర్గంవారు రహదారి వేయడంతో బాధితురాలు అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు స్పందించకపోవడంతో మంగళవారం ఆమె తన వర్గం వారితో కలిసి రోడ్డును తొలగించేందుకు ప్రయత్నించారు. అధికార పార్టీకి చెందిన అర్జున్‌రాజు, ఆయన సోదరుడి కుమారుడు రాజశేఖర్‌రాజు, మరికొందరు కలిసి జయమ్మ, సుబ్బమ్మ, రాజమ్మలపై కర్రలు, రాళ్లతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఇదే సంఘటనలో అధికార పార్టీకి చెందిన మెడిద రాజు, జయమ్మ, సురేష్‌, మణికంఠ, నరసింహ, శివరాజు, నాగరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మన్నూరు, పెనగలూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పోలీసుల ప్రేక్షక పాత్ర: కానిస్టేబుల్‌ చేతిలోని లాఠీని లాక్కొని మరీ దాడి చేశారని బాధితులు ఆరోపించారు. తీవ్రంగా గాయపడినవారిని తీసుకెళ్లేందుకు వచ్చిన 108 వాహనాన్ని కూడా అడ్డుకున్నారని వాపోయారు. సంఘటన స్థలం వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లున్నా ప్రేక్షక పాత్ర పోషించారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందినవారు కావడంతోనే తమకు రక్షణ కల్పించలేదని మహిళలు ఆరోపించారు. రాజంపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పార్టీ పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు అనసూయమ్మ, తెదేపా మండల అధ్యక్షుడు సుబ్బనర్సయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి సుబ్రహ్మణ్యంనాయుడు, గ్రామ నాయకుడు ప్రతాప్‌నాయుడు తదితరులు బాధితులను పరామర్శించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు 18 మందిపై కేసు నమోదు చేశామని మన్నూరు ఎస్సై భక్తవత్సలం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని