అప్పుల బాధతో అన్నదాత బలవన్మరణం

అప్పుల బాధ తాళలేక ఓ రైతు బలవన్మరణానికి పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన ప్రకారం.

Published : 01 Jul 2022 05:17 IST

రాజపేట, కొల్లాపూర్‌, న్యూస్‌టుడే: అప్పుల బాధ తాళలేక ఓ రైతు బలవన్మరణానికి పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన ప్రకారం. రాజపేట మండలం చెందిన గుజ్జుక బాలరాజు(55) తనకున్న ఎకరన్నర పొలంతోపాటు తన సోదరుడు గణేశ్‌ నుంచి ఎకరన్నర భూమిని కౌలుకు తీసుకున్నారు. ఆరు నెలల క్రితం కుమార్తె వివాహం చేశారు. గతంలో వ్యవసాయానికి చేసిన అప్పులతో పాటు పెళ్లికి మరికొంత రుణం తీసుకోవడంతో ఆర్థిక సమస్యలు తీవ్రమయ్యాయి. అప్పులను ఎలా తీర్చాలోనని మనస్తాపానికి గురైన బాలరాజు పొలంలో చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. రాత్రి 8.30 గంటల వరకు తమకెలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

కొల్లాపూర్‌లో రైతు ఆత్మహత్యాయత్నం
తాను కొన్న పూర్తి భూమిని ధరణిలో నమోదు కాకుండా అడ్డుకుంటున్నారంటూ ఓ అన్నదాత తహసీల్దార్‌ కార్యాలయం వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. కొల్లాపూర్‌ మండలం ముక్కిడిగుండం గ్రామానికి చెందిన ఆంజనేయులు 2017లో నార్లాపూర్‌ శివారులో 2 ఎకరాల 29.5 గుంటల భూమిని 2017లో కొనుగోలు చేశారు. అందులో 21.5 గుంటలు నమోదు కాకుండా భూమిని విక్రయించిన గుర్రపు సత్యం కుటుంబ సభ్యులు అడ్డుకుంటున్నారని ఆంజనేయులు చెబుతున్నారు. భార్య, కుటుంబసభ్యులతో కలిసి గురువారం కొల్లాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చిన ఆంజనేయులు పురుగు మందు తాగారు. సిబ్బంది అప్రమత్తమై అడ్డుకున్నారు. ఆయనను తహసీల్దార్‌ రమేశ్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని