ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ 15వరకూ పొడిగింపు

కాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ను రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు

Published : 02 Jul 2022 05:20 IST

రాజమహేంద్రవరం నేరవార్తలు, న్యూస్‌టుడే: కాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ను రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. గతంలో విధించిన రిమాండ్‌ శుక్రవారంతో పూర్తికావడంతో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న అనంతబాబును పోలీసులు శుక్రవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం ఈ నెల 15వరకూ న్యాయమూర్తి రిమాండ్‌ పొడిగించారు. అనంతబాబును జైలు నుంచి కోర్టుకు తరలించే ఎస్కార్ట్‌ అందుబాటులో లేదనే కారణంతో గత రెండు దఫాలుగా ఆన్‌లైన్‌ ద్వారా రిమాండ్‌ పొడిగించారు. తాజాగా పోలీసులు ఎస్కార్ట్‌ ఏర్పాటు చేయడంతో ప్రత్యేక వాహనంలో ఎమ్మెల్సీని కేంద్ర కారాగారం నుంచి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు.

పోలీసుల తీరు చర్చనీయాంశం
సాధారణంగా జైలులో ఉన్న నిందితులను కోర్టుకు తరలించే సమయంలో పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకుంటారు. వాహనంలోంచి నిందితుడిని కోర్టు బయట దించి ఆవరణలో నడిపించుకుని తీసుకెళ్లాలి. దీనికి విరుద్ధంగా శుక్రవారం ఎమ్మెల్సీని పోలీసులు వాహనంలో కోర్టు ఆవరణలోకి తీసుకెళ్లారు. విచారణ అనంతరం మాత్రం కోర్టు ప్రాంగణం నుంచి ఎమ్మెల్సీని నడిపించుకుంటూ బయటకు తీసుకువచ్చిన తర్వాతే వాహనంలో ఎక్కించుకుని జైలుకు తరలించారు. ఈ విషయం బయట చర్చనీయాంశమైంది.

ఛార్జిషీట్‌ నమోదు చేయలేదు: ముప్పాళ్ల
సుబ్రహ్మణ్యం హత్య జరిగి 40 రోజులు గడిచినప్పటికీ ఇప్పటి వరకూ పోలీసులు ఛార్జిషీట్‌ నమోదు చేయలేదని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు చెప్పారు. రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ మంధాత సీతారామమూర్తి, సభ్యుడు గోచిపాత శ్రీనివాసరావు ఎదుట రెండో రోజు శుక్రవారం అనంతబాబు కేసు విచారణ జరిగింది. అనంతరం విచారణ విషయాలను న్యాయవాది ముప్పాళ్ల వివరించారు. కేసును నీరుగార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారనే విషయాన్ని కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం 15ఎ ప్రకారం విచారణను వీడియో తీయాల్సి ఉండగా అలా జరగడం లేదన్నారు. తదిపరి విచారణను కమిషన్‌ ఈ నెల 18కు వాయిదా వేసిందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని