Cyber Crime: ఆన్‌లైన్‌ మోసానికి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని బలి!

ఆన్‌లైన్‌ మోసానికి గురై సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో చోటుచేసుకుంది. ఎస్సై చినబాబు తెలిపిన వివరాల

Updated : 04 Jul 2022 07:06 IST

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: ఆన్‌లైన్‌ మోసానికి గురై సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో చోటుచేసుకుంది. ఎస్సై చినబాబు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరుకు చెందిన జాస్తి శ్వేతా చౌదరి (22) హైదరాబాద్‌లోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. మూడు నెలలుగా ఇంటి నుంచే పని చేస్తోంది. సంస్థ కార్యాలయంలో నేరుగా విధులు నిర్వర్తించేందుకు ఆదివారం తెల్లవారుజామున బంధువులతో కలిసి కారులో హైదరాబాద్‌ వెళ్లేందుకు సిద్ధమైంది. శనివారం సాయంత్రం 5 గంటలకు స్కూటీపై బయటకు వచ్చింది. రాత్రి 8 గంటల సమయంలో తాను చిల్లకల్లు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానని తల్లి ఫోన్‌కు సందేశం పంపింది. తిరిగి ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ రావడంతో తల్లిదండ్రులు హుటాహుటిన చిల్లకల్లు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి గాలించినా ఫలితం లేకపోయింది. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో మృతదేహం లభించింది. వివరాలు సేకరించిన పోలీసులు.. ఆన్‌లైన్‌ మోసమే ఆత్మహత్యకు కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చారు. అపరిచిత వ్యక్తి ఆన్‌లైన్‌లో ఆమెకు పరిచయమై రూ.1.2 లక్షలు చెల్లిస్తే.. రూ.7 లక్షలు తిరిగి వస్తాయని ఆశ చూపాడు. ఆమె తనవద్ద డబ్బుల్లేవని చెప్పింది. ఆ వ్యక్తే రూ.50వేలు ఆమె ఖాతాకు పంపాడు. మిగిలిన మొత్తం కలిపి తాను చెప్పిన ఖాతాకు పంపమన్నాడు. దశల వారీగా మరో రూ.1.3 లక్షలు కట్టించాడు. రెండు రోజులుగా ఆ వ్యక్తి ఫోన్‌ ఎత్తకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన శ్వేత... ఆ కారణంగానే ఆత్మహత్యకు సిద్ధపడి ఉంటుందని, మరిన్ని వివరాల కోసం ప్రయత్నిస్తున్నామని ఎస్సై చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని