ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు

ప్రేమ వివాహం చేసుకున్న యువకుణ్ని యువతి బంధువులు నమ్మించి తీసుకెళ్లి, హతమార్చి మృతదేహాన్ని తగులబెట్టిన వైనమిది. హైదరాబాద్‌లోని

Updated : 04 Jul 2022 07:25 IST

నమ్మించి తీసుకెళ్లి చంపేసిన యువతి కుటుంబ సభ్యులు

జిన్నారం శివారులో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు

అత్తామామలే పొట్టన పెట్టుకున్నారన్న మృతుడి తల్లిదండ్రులు

కేపీహెచ్‌బీకాలనీ, జిన్నారం, గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: ప్రేమ వివాహం చేసుకున్న యువకుణ్ని యువతి బంధువులు నమ్మించి తీసుకెళ్లి, హతమార్చి మృతదేహాన్ని తగులబెట్టిన వైనమిది. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో 6 రోజుల కిందట అదృశ్యమైన యువకుడు సంగారెడ్డి జిల్లా జిన్నారం అడవుల్లో శనివారం రాత్రి శవమై కనిపించారు. పోలీసులు, మృతుడి బంధుమిత్రులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం రాజుపాలెం పంచాయతీ పి.పొట్రెడ్డిపల్లెకి చెందిన శనివారపు బాలిరెడ్డి, నారాయణమ్మ దంపతుల కుమారుడు నారాయణరెడ్డి (25) బీటెక్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. స్వగ్రామంలోనే తమ దూరపు బంధువైన కందుల వెంకటేశ్వరరెడ్డి కుమార్తె రవళిని ప్రేమించి ఏడాది క్రితం గుళ్లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇద్దరి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. ఆ తర్వాత రవళి తండ్రి వెంకటేశ్వరరెడ్డి కుమార్తె తప్పిపోయిందంటూ కొమరోలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. పోలీసులు నారాయణరెడ్డి, రవళిని పది నెలల క్రితం మార్కాపురం డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. ఓ వారంలో రిసెప్షన్‌ ఏర్పాటు చేస్తామని, కుమార్తెను ఇంటికి పంపించాలని తల్లిదండ్రులు కోరడంతో రవళిని వారితో పంపించేశారు. ఆ తర్వాత ఎంత కాలానికీ భార్యను తన దగ్గరికి పంపించకపోవడంతో నారాయణరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేయగా ప్రస్తుతం విచారణలో ఉంది.

నారాయణరెడ్డిని అంతం చేసి, తమ బిడ్డకు మరో పెళ్లి చేయాలని రవళి కుటుంబసభ్యులు పథకం రచించారు. ఈ మేరకు అతనితో పరిచయమున్న యువతి బంధువు శ్రీనివాసరెడ్డి గత నెల 27న రాత్రి 8.40 గంటల సమయంలో మిత్రులు కాశీ, ఆశిక్‌తో కలిసి కేపీహెచ్‌బీలో ఉంటున్న నారాయణరెడ్డి వద్దకు వెళ్లారు. విందు చేసుకుందామని కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. నారాయణరెడ్డి 3 రోజులుగా తిరిగిరాలేదని అతనితోపాటు గదిలో ఉంటున్న బావ చంద్రశేఖర్‌రెడ్డి గత నెల 30న కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై రాజేందర్‌.. నారాయణరెడ్డితోపాటు అనుమానితుల ఫోన్‌కాల్‌ డేటాను విశ్లేషించి శనివారం రాత్రి ఆశిక్‌ను పట్టుకున్నారు.

కారులోనే చంపేసి అడవిలో తగలబెట్టేశారు
జూన్‌ 27న రాత్రి శ్రీనివాసరెడ్డి, కాశీ, ఆశిక్‌.. నారాయణరెడ్డిని కారులో ఎక్కించుకుని ఖాజాగూడ వైపు తీసుకెళ్లారు. ఖాజాగూడలో మద్యం కొని, జిన్నారం వైపు వెళ్లారు. నారాయణరెడ్డిని మార్గమధ్యంలో గొంతు నులిమి చంపేశారు. జిన్నారం శివార్లలోని అడవిలోకి మృతదేహాన్ని తీసుకెళ్లి పెట్రోల్‌ పోసి కాల్చేశారు. అక్కడి నుంచి వారంతా పరారయ్యారు. కాల్‌డేటా సాయంతో పోలీసులు ఆశిక్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది. సీఐ కిషన్‌ సిబ్బందితో శనివారం రాత్రి ఘటనాస్థలికి వెళ్లి, మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం కందుల వెంకటేశ్వరరెడ్డి, అతని కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. తమ బిడ్డను అతని అత్తమామలే పథకం ప్రకారం హత్య చేయించారని నారాయణరెడ్డి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తన భర్తను హత్య చేయించేందుకు తండ్రి పథకం రచిస్తున్నాడని రవళి బంధువులకు ఫోన్‌ చేసి చెప్పిందని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని