Updated : 05 Jul 2022 05:12 IST

దేశంలో మతపరమైన దాడులకు కుట్ర

 నిజామాబాద్‌లో 200 మందికి శిక్షణ

నిందితుడి అరెస్టు

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: దేశంలో మతపరమైన దాడులకు పాల్పడేలా అమాయకులకు శిక్షణ ఇచ్చిన వైనం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో వెలుగుచూసింది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లోని సుమారు 200 మంది యువతకు శిక్షణ ఇచ్చినట్లు తేలింది. నిషేధిత సంస్థ ‘సిమీ’ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు ఏర్పాటు చేసిన పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో దాడులకు కుట్ర జరిగినట్లు నిజామాబాద్‌ డీసీపీ అరవింద్‌బాబు సోమవారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లాకు చెందిన కరాటే మాస్టర్‌ అబ్దుల్‌ ఖాదర్‌ కొంతకాలంగా నిజామాబాద్‌ నగరంలోని ఆటోనగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఓ ఇంట్లో పీఎఫ్‌ఐ పేరిట బ్యానర్లు ఏర్పాటు చేసి కరాటే శిక్షణ ఇస్తున్నాడు. ఈ సంస్థ కార్యకలాపాలపై అనుమానం వచ్చిన ఆరో ఠాణా పోలీసులు కొద్ది రోజులుగా నిఘా ఉంచారు. సోమవారం ఉదయం ఇంట్లో సోదాలు జరిపారు. అక్కడ దాడులకు ఉపయోగించే కర్రలు, నాన్‌చాక్‌లు, పుస్తకాలను స్వాధీనం చేసుకొన్నారు. ఖాదర్‌పై దేశద్రోహం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

తెలుగు రాష్ట్రాల యువతే లక్ష్యంగా..

తాను ఇప్పటివరకు 200 మంది యువతకు విడతలవారీగా శిక్షణ ఇచ్చినట్లు పోలీసుల విచారణలో నిందితుడు ఖాదర్‌ తెలిపాడు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలకు చెందిన యువత ఇందులో ఉన్నట్లు చెప్పాడు. తెలంగాణలోని భైంసా, జగిత్యాల, కరీంనగర్‌, హైదరాబాద్‌ వాసులు, ఏపీలోని నెల్లూరు, కడప, కర్నూలుతో పాటు పలు జిల్లాలకు చెందిన యువత శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం వీరందరూ ఎక్కడున్నారనేది తేలాల్సి ఉంది. సేవా కార్యక్రమాల ముసుగులో ఓ మతానికి వ్యతిరేకంగా యువతలో భావజాలాన్ని ప్రేరేపించడం తమ సంస్థ ముఖ్య ఉద్దేశమని నిందితుడు చెప్పినట్లు డీసీపీ తెలిపారు. యువత ద్వారా దేశంలో ఎప్పుడైనా, ఎక్కడైనా మతపరమైన దాడులు చేయించటమే శిక్షణ లక్ష్యమని అతడు ఒప్పుకొన్నట్లు వెల్లడించారు. దేశంలో అస్థిరత్వం సృష్టించి, షరియత్‌ చట్టం సాధించేలా శిక్షణ ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. శిక్షణ కోసం భారీగా నిధులు సమకూరాయని పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు, ఫోన్‌ డేటాను విశ్లేషించాల్సి ఉందని దర్యాప్తు అధికారి తెలిపారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని