Published : 05 Jul 2022 05:15 IST

కాపు కాసి... పాస్టర్‌ దారుణ హత్య

అక్రమాలు ప్రశ్నించినందుకే ఈ ఘాతుకం

డీఎస్పీకి భార్య నారాయణమ్మ ఫిర్యాదు

సి.ఎస్‌.పురం, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా సీఎస్‌పురం మండలం ఏకునాంపురం గ్రామానికి చెందిన పాస్టర్‌ దాసరి వెంకట రమణయ్య (55)ను గుర్తుతెలియని వ్యక్తులు కాపు కాసి దారుణంగా హత్య చేసిన సంఘటన సోమవారం వెలుగు చూసింది. దర్శి డీఎస్పీ వి.నారాయణస్వామిరెడ్డి వివరాలను వెల్లడించారు. పాస్టర్‌గా జీవనం సాగిస్తున్న వెంకట రమణయ్య ఆదివారం సాయంత్రం నిత్యావసరాల కోసం ఆరివేములకు ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి వస్తున్నారు. మార్గమధ్యలో చెర్లోపల్లి సమీపంలోని వెలుగుగొండ కాలువ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. రహదారి పక్కన ఉన్న తోటలోకి లాక్కెళ్లి తలపై బండరాయితో మోది హత్య చేశారు. సోమవారం ఉదయం మృతదేహాన్ని చూసిన గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొన్నారు. డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీం బృందాన్ని రప్పించారు. జాగిలాలు రహదారి వద్ద నుంచి మృతదేహం వద్దకు, అక్కడి నుంచి కాలువలో పడేసిన నిత్యావసరాలు ఉన్న బస్తా వద్ద,  కాలువ పక్కన సంచరించాయి. క్లూస్‌ టీం వేలిముద్రలను సేకరించింది.

నా భర్తను స్థానికులే కక్షతో హత్య చేశారు

తన భర్తను స్థానికులే కక్షతో హత్య చేశారని వెంకట రమణయ్య భార్య దాసరి నారాయణమ్మ దర్శి డీఎస్పీ వి.నారాయణస్వామిరెడ్డికి ఫిర్యాదు చేశారు. గ్రామంలోని పాఠశాల ప్రహరీ నిర్మాణం రాకపోకలకు అడ్డుగా ఉందని, ఉపాధి హామీ అవకతవకలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం, కేసులు నమోదు కావడంతో కొందరు కక్ష గట్టారని చెప్పారు. భూ వివాదాలపై కోర్టును ఆశ్రయించడంతో అడ్డుతొలగించుకునేందుకే వారు హత్య చేయించి ఉంటారని ఆమె ఆరోపించారు. గ్రామానికి చెందిన నలుగురు అనుమానితులపై ఆమె డీఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని