చేపల డబ్బాల్లో గంజాయి రవాణా

ఆంధ్రప్రదేశ్‌లోని అరకు నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలోని ముగ్గురు సభ్యులను ఆబ్కారీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి రూ.కోటి

Published : 06 Jul 2022 04:58 IST

హైదరాబాద్‌లో రూ.కోటి విలువైన 440 కిలోల సరకు పట్టివేత

ఏపీ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్‌

ఉప్పల్‌, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌లోని అరకు నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలోని ముగ్గురు సభ్యులను ఆబ్కారీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి రూ.కోటి విలువైన 440 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్‌ ఆబ్కారీ స్టేషన్‌లో మంగళవారం అధికారులు ఈ వివరాలు వెల్లడించారు. ఏపీలోని కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన పెరపురెడ్డి అర్జున్‌(25), పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన నేరళ్ల కిరణ్‌కుమార్‌(26), హైదరాబాద్‌ ఫలక్‌నుమాకు చెందిన సయ్యద్‌ తహెర్‌(24)తో పాటు వీరేంద్రకుమార్‌, సందీప్‌, తేజ, ఫజల్‌ ముఠాగా ఏర్పడ్డారు. వీరు చేపలు రవాణా చేసే ప్లాస్టిక్‌ డబ్బాల్లో గంజాయి ప్యాకెట్లు నింపి డీసీఎం వాహనంలో ఆదివారం బయలుదేరారు. అనుమానం రాకుండా ఉండేందుకు విశాఖపట్నంలో కొన్ని చేపల డబ్బాలను సైతం వాహనంలో ఎక్కించారు. వరంగల్‌లో చేపలు ఉన్న డబ్బాలను దించి.. సోమవారం రాత్రికి ఆ వాహనం ఉప్పల్‌ భగాయత్‌లోని హెచ్‌ఎండీఏ లేఅవుట్‌కు చేరుకుంది. ఇక్కడి నుంచి మహారాష్ట్రలోని సాంగ్లి, సోలాపుర్‌కు గంజాయిని తరలించేందుకు కారులోకి మారుస్తుండగా.. పక్కా సమాచారంతో ఉప్పల్‌ ఆబ్కారీ పోలీసులు దాడి చేశారు. డబ్బాల్లో ఉన్న 440 కిలోల గంజాయి ప్యాకెట్లను, డీసీఎం వ్యాన్‌, కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలోని అర్జున్‌, కిరణ్‌కుమార్‌, తహెర్‌ పట్టుబడగా.. మిగతా నలుగురు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కిరణ్‌కుమార్‌పై భద్రాచలం పోలీస్‌స్టేషన్‌లో ఇప్పటికే గంజాయి రవాణా కేసు ఉందని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు