Hyderabad News: ఎంబీఏలో గోల్డ్‌మెడల్‌.. 200 దొంగతనాలు..!

అతను ఎంబీఏలో బంగారు పతకం సాధించాడు. క్యాబ్‌ డ్రైవర్‌గా వృత్తిని ఎంచుకుని.. ఇళ్లలో చోరీలు చేయడాన్ని ప్రవృత్తిగా మార్చుకున్నాడు. అలా ఒకటి కాదు.. రెండు కాదు..

Updated : 06 Jul 2022 10:34 IST

పోలీసులకు చిక్కిన ఘరానా దొంగ

పద్మారావునగర్‌, న్యూస్‌టుడే: అతను ఎంబీఏలో బంగారు పతకం సాధించాడు. క్యాబ్‌ డ్రైవర్‌గా వృత్తిని ఎంచుకుని.. ఇళ్లలో చోరీలు చేయడాన్ని ప్రవృత్తిగా మార్చుకున్నాడు. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. 200 వరకు దొంగతనాలు చేసి పలుమార్లు జైలుకెళ్లొచ్చాడు. అయినా తీరు మార్చుకోలేదు. తాజాగా మరో కేసులో హైదరాబాద్‌లోని గాంధీనగర్‌ పోలీసులకు చిక్కాడు. ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన మిక్కిలి వంశీకృష్ణ అలియాస్‌ లోకేశ్‌ అలియాస్‌ సామ్‌ రిచర్డ్‌ నగరంలో క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత నెలలో కవాడిగూడలోని ఓ ఇంట్లో దొంగతనం కేసులో వంశీకృష్ణను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 19 తులాల బంగారు నగలు, రూ.3 లక్షల నగదుతో పాటు రెండు సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు.

జల్సాల కోసం..:
వంశీకృష్ణ 2004లో ఎంబీఏలో గోల్డ్‌మెడల్‌ సాధించాడు. ఆ తర్వాత జల్సాలకు అలవాటు పడ్డాడు. అందుకోసం సులభంగా డబ్బు సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నాడు. దొంగతనాలే మార్గమని నిర్ణయించుకున్నాడు. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలు మొదలుపెట్టాడు. హైదరాబాద్‌ నగరంతోపాటు ఏపీలోని పలు జిల్లాల్లోనూ దొంగతనాలకు పాల్పడ్డాడు. 2006 నుంచి ఇప్పటివరకు 200 ఇళ్లలో దొంగతనాలు చేశాడని పోలీసులు తెలిపారు. వివిధ కేసుల్లో సుమారు 67 నెలల జైలుశిక్ష అనుభవించాడు. అతనిపై పోలీసులు రెండుసార్లు పీడీ యాక్ట్‌ కూడా నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని