Published : 07 Jul 2022 05:51 IST

మత ఘర్షణల కుట్ర.. మరో ముగ్గురి అరెస్టు

నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వెల్లడి

ఈనాడు, నిజామాబాద్‌: అమాయక యువకులను చేరదీసి మతోన్మాద శక్తులుగా మార్చే కుట్రలో భాగమైన ముగ్గురు వ్యక్తులను బుధవారం అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. సోమవారం ఇదే నేరం కింద కరాటే మాస్టర్‌ ఖాదర్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిజామాబాద్‌ శివారు గుండారంలో ఉంటున్న షాదుల్లా (ఏ-5)తో పాటు ఆయన ఇంట్లోనే మహ్మద్‌ అన్వర్‌ (ఏ-24), అబ్దుల్‌ మొబిన్‌ (ఏ-28)ను తాజాగా అరెస్టు చేశారు. వీరు నిషేధిత సిమి సంస్థలో ఇదివరకు కొనసాగారని, పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)గా ఏర్పడి మత ఘర్షణలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ నాగరాజు విలేకరులకు తెలిపారు. సామాజిక కార్యక్రమాల ముసుగులో పేద కుటుంబాల వారిని చేరదీస్తూ ఆత్మరక్షణ విద్యలో తర్ఫీదు ఇస్తున్నారన్నారు.ఇలాంటి వారిని 30 మంది వరకు గుర్తించామని, దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఇప్పటికి నలుగురిని అరెస్టు చేసినట్లు వివరించారు. మరికొందరిని కూడా పట్టుకొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఖాదర్‌ ఇల్లు నిర్మించుకొనే సందర్భంలో షాదుల్లా పీఎఫ్‌ఐ సంస్థ నుంచి రూ.6 లక్షలు ఇప్పించినట్లు వివరించారు. ఇందుకుగాను గతేడాది అతడిని సంస్థలో కలుపుకొని.. యువకులకు కరాటే శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సంస్థపై రాష్ట్రంలో నిషేధం లేనప్పటికీ నిందితుల వద్ద దొరికిన సాహిత్యాన్ని కేసులో ఆధారంగా చూపుతామన్నారు. వీరందరిపై ఉపా చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు.


శిక్షణ వెనుక పోలీసులు!
ఎంపీ అర్వింద్‌ ఆరోపణ

నిజామాబాద్‌లో ఉగ్రమూకల శిక్షణ కొనసాగుతోందని, దీని వెనుకాల పోలీసు అధికారులు ఉన్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు. అన్నీ తెలిసినా ఉదాసీనంగా వ్యవహరిస్తున్న పోలీస్‌ కమిషనర్‌ నాగరాజును తక్షణమే విధుల్లోంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. బుధవారం సాయంత్రం ఎంపీ విలేకరులతో మాట్లాడారు.కేంద్ర నిఘా వర్గాలు ఒత్తిడి చేసిన నేపథ్యంలో పోలీసులు తాజాగా అరెస్టులు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో గంజాయి రవాణా భారీగా జరుగుతోందని, అరకు నుంచి దిగుమతి దందా వెనుక ఎమ్మెల్యేలున్నారనీ ఆరోపించారు. ఎంపీ ఆరోపణలపై పోలీస్‌ కమిషనర్‌ పరోక్షంగా స్పందించారు. ‘కొందరు కళ్లు.. చెవులు మూసుకున్న వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నార’ని పేర్కొన్నారు. తాము ఇదివరకు కేసులు పెట్టడంవల్లే పీఎఫ్‌ఐ వంటి సంస్థల కార్యకలాపాల కట్టడి జరిగిందన్నారు.


Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని