Cyber Crime: నకిలీ ఇన్‌స్టాగ్రాం ఖాతాలతో లైంగిక వేధింపులు, వసూళ్లు

యువతులు, విద్యార్థినులు మీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను జాగ్రత్తగా నిర్వహించండి. మహిళలు, యువతుల పేర్లతో మీకు స్నేహపూర్వక అభ్యర్థనలు పంపితే స్పందించకండి. ఎందుకంటే మీ

Updated : 14 Jul 2022 08:54 IST

ఫొటోలు మార్ఫింగ్‌ చేసి బెదిరింపులు

ముంబయి, హైదరాబాద్‌లలో పెరుగుతున్న కేసులు

ఈనాడు,హైదరాబాద్‌ : యువతులు, విద్యార్థినులు మీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను జాగ్రత్తగా నిర్వహించండి. మహిళలు, యువతుల పేర్లతో మీకు స్నేహపూర్వక అభ్యర్థనలు పంపితే స్పందించకండి. ఎందుకంటే మీ ఖాతాలోని ఫొటోలు, వీడియోలను అసభ్యంగా మార్చి మీరు పంపించినట్టుగానే మీ పేరుతో పదుల సంఖ్యలో ఇన్‌స్టా ఖాతాలను తెరిచి స్నేహితులు, కుటుంబసభ్యులకు పంపుతామంటూ బెదిరింపులు వచ్చే అవకాశాలున్నాయి. వాటిని పంపించకుండా ఉండేందుకు డబ్బు డిమాండ్‌ చేయవచ్చు. లైంగిక కోర్కెలు తీర్చాలంటూ హెచ్చరించే ప్రమాదాలున్నాయని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్‌, ముంబయి, దిల్లీ, బెంగళూరు నగరాల్లో ఈ తరహా నేరాలు ఎక్కువవుతున్నాయని వివరిస్తున్నారు. హైదరాబాద్‌లో నాలుగైదు నెలల నుంచి పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో వ్యక్తిగత ఐచ్ఛికాంశాలను ‘‘కేవలం నాకు మాత్రమే’’ అని ఎంచుకుంటే కొత్తవారు, కొత్త స్నేహితులు ఫోటోలు, వీడియోలు చూడలేరని సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు.

వీడియోకాల్‌.. రికార్డు
ప్రముఖ బహుళజాతి సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఎం.ప్రశాంత్‌ను రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కొద్దిరోజుల క్రితం అరెస్ట్‌ చేశారు. నాలుగు నెలల క్రితం ప్రశాంత్‌ ఓ యువతి పేరుతో అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను తెరిచాడు. అందులో అసభ్యకర, ఆశ్లీల ఫొటోలు పోస్ట్‌ చేస్తుండేవాడు. బాధితురాలికి ఆమె స్నేహితులు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాల్‌గర్ల్‌గా చిత్రీకరణ
దిల్లీలో ఉంటున్న అంకిత్‌ కుమార్‌ ఓ యువతితో స్నేహం పేరుతో పరిచయం పెంచుకున్నాడు. అతడి డేటింగ్‌ ప్రపోజల్‌ని ఆ యువతి తిరస్కరించడంతో ఆమె పేరుతో 12 ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు తెరిచాడు. దీంతో పాటు డేటింగ్‌ యాప్‌లో ఆమె ఫోటో, ఫోన్‌నంబర్‌ను ఉంచి కాల్‌గర్ల్‌గా చిత్రీకరించాడు. వందల సంఖ్యలో కాల్స్‌ వస్తుండడంతో బాధితురాలు ఉత్తమ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా గతనెల 3న నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

పదేళ్ల బాలుడే
సూరత్‌తో ఉంటున్న పదిహేడేళ్ల బాలుడు తన పక్కింట్లో ఉంటున్న 25 ఏళ్ల యువతి ఫొటోలు సేకరించి ఆమె పేరుతో అయిదు ఇన్‌స్టా ఖాతాలను తెరిచాడు. అందులో ఆమె ఫొటోలను మార్ఫింగ్‌ చేసి అసభ్యంగా మార్చి ఆమె స్నేహితుల వాట్సప్‌ నంబర్లకు పంపించేవాడు. ఎవరు పంపిస్తున్నారో తెలీదని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా... పోలీసులు పదిహేడేళ్ల బాలుడిని నిందితుడిగా గుర్తించి గతేడాది అక్టోబరులో అరెస్ట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని