Casino: ప్రముఖుల బంధాలు... హవాలా కోణాలు

క్యాసినో దందాలో హవాలా కోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు కూపీ లాగుతున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా నోటీసులు ఇవ్వడంతో చీకోటి ప్రవీణ్‌, అతని అనుచరుడు మాధవరెడ్డి సోమవారం ఈడీ

Updated : 02 Aug 2022 05:25 IST

ప్రవీణ్‌, మాధవరెడ్డిలపై ప్రశ్నల వర్షం
ఈడీ చేతిలో క్యాసినో దందా గుట్టు

ఈనాడు, హైదరాబాద్‌: క్యాసినో దందాలో హవాలా కోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు కూపీ లాగుతున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా నోటీసులు ఇవ్వడంతో చీకోటి ప్రవీణ్‌, అతని అనుచరుడు మాధవరెడ్డి సోమవారం ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఉదయం 10.30 నుంచి రాత్రి 9.30 వరకు దాదాపు 11 గంటల పాటు వారిని అధికారులు విచారించారు. విదేశీ లావాదేవీలు, హవాలా వ్యాపారాలకు సంబంధించి తమ దర్యాప్తులో వెల్లడయిన అంశాలపై సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు ప్రముఖులతో ఉన్న ఆర్థిక బంధాలపై కూడా ఈడీ ఆరా తీస్తున్నట్లు సమాచారం.

క్యాసినోలు నిర్వహిస్తూ ప్రముఖులను చార్టర్‌ ఫైట్లలో నేపాల్‌, బ్యాంకాక్‌ తరలిస్తున్న ప్రవీణ్‌, అతని అనుచరుల ఇళ్లపై ఈడీ దాడులు నిర్వహించింది. చట్టపరంగా ఇందులో తప్పుపట్టే అంశాలు ఏమీ లేకపోయినా క్యాసినోల మాటున పెద్దమొత్తంలో విదేశీ మారకద్రవ్యం దారి మళ్లిందని, బంగారం అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చారని అధికారులకు సమాచారం అందింది. ఈ సందర్భంగా ఈడీ అధికారుల దర్యాప్తులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, స్థిరాస్తి వ్యాపారులు అనేక మంది క్యాసినోలకు వెళ్ళినట్లు ఆధారాలు లభించాయి. ఇప్పటి వరకూ దర్యాప్తులో తాము సేకరించిన సమాచారం ఆధారంగా ప్రవీణ్‌, మాధవరెడ్డిలను సోమవారం ఈడీ అధికారులు ప్రశ్నించారు. హవాలా ద్వారా నగదు బదిలీ జరిగినట్లు గుర్తించిన నేపథ్యంలో అడిగిన ప్రశ్నలకు ప్రవీణ్‌, మాధవరెడ్డిలు కొంత తడబడ్డట్లు తెలుస్తోంది. ఇతర దేశాల్లోని క్యాసినోల్లో జూదం ఆడాలంటే విదేశీ మారక ద్రవ్యం కావాలి. కానీ ఇక్కడి నుంచి పెద్దమొత్తంలో విదేశీ కరెన్సీ తీసుకెళ్లడం సాధ్యంకాదు. అందుకే తమకు కావాల్సిన విలువకు నగదు చెల్లిస్తే ప్రవీణ్‌ తదితరులు ఇక్కడే టోకెన్లు ఇచ్చేవారు. వాటితో విదేశాల్లో జూదం ఆడేవారు. జూదంలో గెలిస్తే అందుకు సమానమైన టోకెన్లు అక్కడ ఇచ్చేవారు. వాటిని తెచ్చి ఇక్కడ ప్రవీణ్‌కు ఇస్తే వాటి విలువకు తగ్గ నగదు చెల్లింపులు జరిగేవని సమాచారం. ఫెమా నిబంధనల ప్రకారం ఇది చట్టవిరుద్ధం. ఇప్పుడు ఈడీ దీనిపైనే దృష్టి సారించింది.

పెద్దల బండారం బయటపడేనా..

క్యాసినోలకు వెళ్ళడం చట్ట విరుద్ధం కాదు. కానీ ప్రజాప్రతినిధులు జూదం ఆడేందుకు వెళ్లారంటే వ్యక్తిగతంగా వారికి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తవచ్చు. కొన్ని సంవత్సరాలుగా ప్రవీణ్‌ ద్వారా విదేశాల్లో క్యాసినోలకు వెళ్లిన అనేక మంది ప్రముఖుల వివరాలు ఈడీ దాడుల్లో బయటపడ్డట్లు తెలుస్తోంది. వీరిలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. విదేశీ మారకద్రవ్యానికి సంబంధించి వీరి ప్రమేయం ఉన్నట్లు బయటపడితే రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా సంచలనం సృష్టిస్తుందనడంలో సందేహం లేదు. ఈడీ విచారణ సందర్భంగా క్యాసినోల నిర్వహణకు సంబంధించి పెద్దమొత్తంలో బ్యాంకు ఖాతాలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఇందులో విదేశీ బ్యాంకులకు చెందిన ఖాతాలు కూడా ఉన్నాయని, వాటి ద్వారా పెద్దమొత్తంలో లావాదేవీలు జరిగినట్లు తేలిందని సమాచారం. ప్రధానంగా క్యాసినో తరఫున ప్రచారం నిర్వహించిన అనేక మంది సినీతారలకు వీటి ద్వారానే నగదు బదిలీ జరిగినట్లు గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు