ఆస్తి కోసం కుటుంబ సభ్యుడినే కడతేర్చారు!

నాలుగెకరాల పొలం ఓ అమాయకుడి ప్రాణం తీసింది.. ఆస్తి కోసం కుటుంబ సభ్యులే కళ్లలో కారం కొట్టి.. ఇనుప రాడ్లతో కొట్టి కిరాతకంగా హతమార్చిన దారుణ ఉదంతం వైయస్‌ఆర్‌

Published : 06 Aug 2022 05:03 IST

పులివెందులలో వ్యక్తి దారుణ హత్య

కారంపొడి చల్లి గొంతు కోసి హతమార్చిన వైనం

పులివెందుల, న్యూస్‌టుడే: నాలుగెకరాల పొలం ఓ అమాయకుడి ప్రాణం తీసింది.. ఆస్తి కోసం కుటుంబ సభ్యులే కళ్లలో కారం కొట్టి.. ఇనుప రాడ్లతో కొట్టి కిరాతకంగా హతమార్చిన దారుణ ఉదంతం వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందులలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సింహాద్రిపురం మండలం హిమకుంట్ల గ్రామానికి చెందిన పి.నారాయణరెడ్డి, కళావతిలకు లక్ష్మీనారాయణరెడ్డి, ఆదినారాయణరెడ్డి, కుమార్తె లక్ష్మీనారాయణమ్మ సంతానం. పెద్ద కుమారుడు, కుమార్తెకు పెళ్లిళ్లు కాగా, రెండో కుమారుడు ఆదినారాయణరెడ్డి (48) వివాహం చేసుకోలేదు. వీరంతా పులివెందులలోని వైఎస్‌ భారతి నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఏడాది కిందట తల్లి అనారోగ్యంతో చనిపోగా ఆదినారాయణరెడ్డి కూలీ పనులు చేస్తూ తండ్రిని చూసుకునేవాడు. ఆయన తనకున్న ఎనిమిది ఎకరాల భూమిని ఇద్దరు కుమారులకు చెరిసగం రాసి ఇచ్చాడు. పెద్ద కొడుకు లక్ష్మీనారాయణరెడ్డికి ఇచ్చిన నాలుగెకరాల భూమి చెరువు పునర్నిర్మాణంలో ముంపునకు గురైంది. దీంతో తన తమ్ముడికి వాటా కింద దక్కిన భూమిని తనకు రాసి ఇచ్చేయాలంటూ పట్టుబట్టేవాడు. పెళ్లి కూడా కాలేదు నీకెందుకు ఆస్తి అంటూ గొడవ పెట్టేవాడు. చివరకు భార్య రమాదేవితో కలిసి అతడిని చంపాలని పథకం రచించాడు. గురువారం రాత్రి తండ్రిని తన ఇంటికి పిలిచి.. తమ పథకం చెప్పి ఒప్పించారు. ఇకనుంచి ఆయన బాగోగులన్నీ తామే చూసుకుంటామని నమ్మబలికాడు. శుక్రవారం తెల్లవారుజామున ముగ్గురూ కలసి పక్కవీధిలో ఆదినారాయణరెడ్డి ఉంటున్న ఇంటికి చేరుకున్నారు. ముందుగా విద్యుత్తు తీగను కత్తిరించి సరఫరా నిలిపివేశారు. ఇంట్లో నిద్రపోతున్న ఆదినారాయణరెడ్డిని పిలిచారు. అతను బయటకు రాగానే కళ్లలో కారం కొట్టి.. ఇనుప రాడ్లతో తలపై మోది దారుణంగా హత్య చేశారు. పోలీసు కుక్కలు వస్తే వాసన పసిగట్టకుండా ఉండడానికి చుట్టుపక్కల కారంపొడి చల్లారు. ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహంపై పురుగుల మందు పోసి అన్న, వదిన వెళ్లిపోయారు. తర్వాత తండ్రి నారాయణరెడ్డి తన చిన్నకుమారుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంటూ బంధువులకు సమాచారం ఇచ్చాడు. అయితే మృతదేహంపై గాయాలను చూసి స్థానికులకు అనుమానం వచ్చింది. ఈ సమాచారం తెలిసిన డీఎస్పీ శ్రీనివాసులు, అర్బన్‌ సీఐ రాజు, పులివెందుల రూరల్‌ సీఐ మద్దిలేటి అక్కడకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని