లైన్‌క్లియర్‌లో పొరపాటు.. విద్యుదాఘాతంతో యువకుడి మృతి

విద్యుత్తు ఉపకేంద్రంలోని సిబ్బంది నిర్లక్ష్యంతో ఒక గ్రామానికి ఇవ్వాల్సిన లైన్‌క్లియర్‌ను (ఎల్‌సీ) మరో గ్రామానికి ఇవ్వడంతో విద్యుత్తు పనులు చేస్తున్న యువకుడు ప్రాణాలు

Updated : 07 Aug 2022 07:55 IST

అట్లూరు, న్యూస్‌టుడే: విద్యుత్తు ఉపకేంద్రంలోని సిబ్బంది నిర్లక్ష్యంతో ఒక గ్రామానికి ఇవ్వాల్సిన లైన్‌క్లియర్‌ను (ఎల్‌సీ) మరో గ్రామానికి ఇవ్వడంతో విద్యుత్తు పనులు చేస్తున్న యువకుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన వైయస్‌ఆర్‌ జిల్లా అట్లూరు మండలంలోని కమలకూరు విద్యుత్తు ఉపకేంద్రం పరిధి మణ్యంవారిపల్లెలో శనివారం చోటు చేసుకుంది. ప్రమాదంలో కుంభగిరికి చెందిన పాలకొండు గంగిరెడ్డి (26) మృతి చెందారు. గంగిరెడ్డి విద్యుత్తు సిబ్బంది వద్ద స్తంభాలు ఎక్కి మరమ్మతు చేసే దినకూలీగా పనిచేస్తున్నారు. మణ్యంవారిపల్లెలో సింగిల్‌ఫేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతు కోసం స్థానిక జేెఎల్‌ఎం రాజయ్యతో కలిసి వెళ్లారు. కమలకూరు ఉపకేంద్రంలో ఆపరేటర్‌ వెంకటరమణ ఉండగా.. జేెఎల్‌ఎం ఫోన్‌ ద్వారా ఎల్‌సీ తీసుకున్నారు. వీరిద్దరి మధ్య సమాచార వినిమయ లోపంతో మణ్యంవారిపల్లెకు ఇవ్వాల్సిన ఎల్‌సీ తంబళ్లగొంది ఫీడర్‌కు వెళ్లింది. ఎల్‌సీ ఉందనే నమ్మకంతో మణ్యంవారిపల్లెలో స్తంభం ఎక్కి గంగిరెడ్డి విద్యుత్తుషాక్‌తో కిందపడ్డారు. బద్వేలు ఆసుపత్రికి చేర్చే సమయంలో కన్నుమూశారు. గంగిరెడ్డికి తల్లిదండ్రులు లేరు. సోదరుడి వద్ద నివసిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని