పంట నష్టంతో ముగ్గురి బలవన్మరణం

ఇటీవలి వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని ఆదిలాబాద్‌ జిల్లాలో ముగ్గురు బలవన్మరణం చెందారు. ఇందులో ఇద్దరు.. తల్లీకుమారులు. పంట పోయిన బాధతో పాటు

Published : 07 Aug 2022 04:53 IST

ఇందులో ఇద్దరు.. తల్లీకుమారులు

నార్నూర్‌ మండలంలో మరో రైతు కూడా

గుడిహత్నూర్‌, నార్నూర్‌, న్యూస్‌టుడే: ఇటీవలి వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని ఆదిలాబాద్‌ జిల్లాలో ముగ్గురు బలవన్మరణం చెందారు. ఇందులో ఇద్దరు.. తల్లీకుమారులు. పంట పోయిన బాధతో పాటు కుటుంబ కలహాలతో తల్లీ కుమారుల మధ్య మాటామాటా పెరిగి పురుగుమందును తాగి జీవితాలను వదిలేశారు. కట్టుకున్న భార్య, ఒక్కగానొక్క కుమారుడు తన ముందే తనువు చాలించడం చూసి మంచాన పడి ఉన్న ఇంటి పెద్దదిక్కు రోదన వర్ణనాతీతం. ఈ విషాద ఘటన ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలంలో జరిగింది. ఎస్సై ప్రవీణ్‌కుమార్‌, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ధంపూర్‌ గ్రామానికి చెందిన రత్నం రాధ(45)-దేవిదాస్‌లకు ఒక కుమార్తె, ఒక కుమారుడు హరీష్‌(22) ఉన్నారు. అదే గ్రామంలోని లక్ష్మీబాయికి చెందిన ఏడెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి, సోయా సాగు చేస్తున్నారు. ఇటీవలి వర్షాలతో వేసిన పంటలు దెబ్బతిన్నాయి. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పంట తీవ్రంగా నష్టపోయిందని తల్లీకొడుకుల మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో హరీష్‌ పురుగుమందు తాగి పడిపోయాడు. అతడిని రిమ్స్‌కు తరలించగా రాత్రి 10.40 గంటలకు మృతి చెందాడు. తల్లి అదే పురుగుమందును తాగి పడిపోయింది. ఆమెను కూడా రిమ్స్‌కు తీసుకెళ్లగా రాత్రి 11.20 గంటల ప్రాంతంలో మృతి చెందింది. కుటుంబ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఏఎస్సై గంగారెడ్డి, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్నూర్‌ మండలంలోని మలంగీ గ్రామానికి చెందిన పవార్‌ ప్రేమ్‌దాస్‌(40) తనకున్న రెండు ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట మొత్తం నీటమునిగింది. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంట్లోనే పురుగుమందు తాగారు. అనంతరం విషయాన్ని భార్య భారతాబాయికి చెప్పారు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఉట్నూర్‌ ఆసుపత్రికి తీసుకెళుతుండగా.. మార్గంలో మరణించారు. ప్రేమ్‌దాస్‌కు భార్య, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని