మాదకద్రవ్యాలను విక్రయిస్తున్న ముఠా అరెస్టు

విశాఖలో మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ నుంచి గోవాకు గంజాయి తీసుకెళ్లి అక్కడి నుంచి మాదక ద్రవ్యాలను

Published : 08 Aug 2022 05:32 IST

ఎం.వి.పి.కాలనీ, జగదాంబ కూడలి, న్యూస్‌టుడే : విశాఖలో మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ నుంచి గోవాకు గంజాయి తీసుకెళ్లి అక్కడి నుంచి మాదక ద్రవ్యాలను తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన వివరాలను నగర పోలీసు కమిషనర్‌ సి.హెచ్‌.శ్రీకాంత్‌ ఆదివారం విలేకరులకు వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ బుచ్చిరాజుపాలెంకు చెందిన పి.రవికుమార్‌ (23) ఐ.టి.ఐ. పూర్తి చేసి ఓ కంపెనీలో సేల్స్‌ ప్రమోటర్‌గా పనిచేస్తున్నాడు. రవికుమార్‌ స్థానికంగా ఉన్న దినేష్‌ నుంచి గంజాయిని కొనుగోలు చేసి గోవాలో తనకు పరిచయం ఉన్న దిలీప్‌కు, అతని స్నేహితులకు విక్రయించేవాడు. అక్కడి నుంచి మాదకద్రవ్యాలు తెచ్చి విశాఖలో విక్రయిస్తున్నాడు. అందులో భాగంగా ఇటీవల గోవా నుంచి 6 ఎల్‌ఎస్‌డీ బోల్ట్స్‌ తీసుకువచ్చి సిగరెట్‌ ప్యాకెట్లలో ఎల్‌ఎస్‌డీ బోల్ట్స్‌ను విశాఖ ఎన్‌ఏడీ సమీపంలో విక్రయించాడు.

* ఆదివారం స్నేహితుల దినోత్సవం కావడంతో భారీగా విక్రయాలు జరిపేందుకు సన్నాహాలు చేసుకుని రవికుమార్‌ 50 ఎల్‌ఎస్‌డీ బోల్ట్స్‌, ఎండీఎంఎ పౌడర్‌ గోవా నుంచి తీసుకువచ్చి విశాఖలో విక్రయించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం రావటంతో శనివారం రాత్రి దాడులు జరిపి రవికుమార్‌తో పాటు ఒ.వాసు దేవ కటన్య(32), ఎం.మోజెస్‌(25), అప్పికొండ యాదకిశోర్‌(26), ఎం.సందీప్‌లను అరెస్టు చేశారు.

వీరిలో వాసుదేవ కటన్య గతంలో రేవ్‌పార్టీలో నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఇక ఎం.సందీప్‌పై గతంలో బెంగళూరులో ఎన్‌డీపీఎస్‌ కేసు నమోదైంది. డార్క్‌వెబ్‌సైట్లను ఉపయోగించి క్రిప్టో కరెన్సీ ద్వారా మాదకద్రవ్యాలను కొనుగోలు చేస్తూ.. సామాజిక మాధ్యమాల ద్వారా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.  వీరిలో దినేష్‌ను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని