Crime News: కుమార్తెను నేలకేసి కొట్టిన తండ్రి..

ఓ తండ్రి తన మూడేళ్ల కుమార్తెపై క్రూరంగా ప్రవర్తించాడు. ఇష్టారీతిన కొట్టడంతో పాటు నేలకేసి విసిరికొట్టి బయటకు వెళ్లిపోయాడు. ఇప్పుడా బాలిక ప్రాణాపాయ స్థితిలో చికిత్స

Updated : 08 Aug 2022 07:17 IST

ప్రాణాపాయ స్థితిలో బాలిక..

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: ఓ తండ్రి తన మూడేళ్ల కుమార్తెపై క్రూరంగా ప్రవర్తించాడు. ఇష్టారీతిన కొట్టడంతో పాటు నేలకేసి విసిరికొట్టి బయటకు వెళ్లిపోయాడు. ఇప్పుడా బాలిక ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ ఠాణా పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

బోరబండ నివాసి బాసిత్‌ అలీఖాన్‌, మాసాబ్‌ట్యాంక్‌ సమీప ఫస్ట్‌లాన్సర్‌కు చెందిన సనా ఫాతిమా 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు కుమార్తెలున్నారు. ఏసీగార్డ్స్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. సనా ప్రస్తుతం 8 నెలల గర్భవతి. ఆటోడ్రైవర్‌గా వచ్చే సంపాదన చాలక, ఇతర కారణాలతో బాసిత్‌ కొన్నాళ్లుగా పిల్లలపై విపరీతంగా కోప్పడటం, కొట్టడం చేస్తున్నాడు. శనివారం సాయంత్రం పనికి వెళ్లే సమయంలో మూడో కుమార్తె సకీనా ఫాతీమా(3) స్నానాల గదిలో ఆడుకుంటోంది. బయటకు రమ్మని తండ్రి పిలిస్తే వెళ్లలేదు. పట్టలేని కోపంతో గంటెతో ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. అడ్డుకోబోయిన భార్యను నెట్టేశాడు. కిందపడి ఆమె స్పృహతప్పింది. తర్వాత కుమార్తెను పైకెత్తి నేలకేసి కొట్టి బయటికెళ్లిపోయాడు. స్పృహ వచ్చాక చూసి కుమార్తె నిద్రపోతోందని తల్లి భావించింది. కొద్దిసేపటి తరువాత పాలు పట్టేందుకు లేపేందుకు యత్నించగా, శరీరం చల్లగా ఉండటం.. నోటి నుంచి నురగలు రావటంతో ఆందోళనకు గురై వెంటనే నిలోఫర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఉస్మానియాకు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బాసిత్‌ ఉస్మానియా వద్దకు వెళ్లి కుమార్తెను చూసి కూలబడ్డాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త బాసిత్‌పై కేసు నమోదు చేశారు. భర్త జైలుకెళితే తమ పరిస్థితి ఏంటని భార్య సనా ఫాతిమా కన్నీరుమున్నీరవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని