చేపల వేటకు వెళ్లి యువకుని గల్లంతు

చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ఏట్లో గల్లంతవగా.. గాలించడానికి వచ్చిన సహాయక సిబ్బందిలో ఒకరు నీట మునిగి మృతి చెందారు. మరొకరు గల్లంతయ్యారు. ఖమ్మం జిల్లా

Published : 12 Aug 2022 05:24 IST

కాపాడటానికి వెళ్లిన ఒకరి మృతి.. మరొకరి గల్లంతు

నేలకొండపల్లి, న్యూస్‌టుడే: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ఏట్లో గల్లంతవగా.. గాలించడానికి వచ్చిన సహాయక సిబ్బందిలో ఒకరు నీట మునిగి మృతి చెందారు. మరొకరు గల్లంతయ్యారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్థేపల్లి గ్రామంలో పాలేరు ఏటిపైనున్న చెక్‌డ్యాం కమ్‌ బ్రిడ్జి వద్ద గురువారం ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. బ్రిడ్జి వద్ద చేపలు పట్టేందుకు.. అదే మండలంలోని చెన్నారం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు గురువారం ఉదయం 5 గంటలకు వచ్చారు. వీరిలో అఫ్జల్‌, పగడాల రంజిత్‌(26)లు చేపలు పడుతూ ప్రమాదవశాత్తూ నీటిలో కొట్టుకుపోయారు. అఫ్జల్‌ను అక్కడ ఉన్న స్థానిక జాలరి ఒకరు క్షేమంగా పైకి లాగారు. నీటిలో మునిగిన రంజిత్‌ కోసం స్థానికులు, బంధువులు గాలించారు. సాయంత్రం 4 గంటలకు స్థానిక ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి సూచనతో మండలాధికారులు ఖమ్మం మున్సిపాలిటీకి చెందిన డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని పిలిపించారు. నలుగురితో కూడిన ఈ బృందం గల్లంతైన రంజిత్‌ కోసం గాలింపు చేపట్టింది. చెక్‌డ్యాం వద్ద నీటి ప్రవాహ వేగానికి బృంద లీడర్‌ బాశెట్టి ప్రదీప్‌(32), మరో సభ్యుడు పడిగెల వెంకటేశ్వర్లు(29) ఏటిలో కొట్టుకుపోయారు. వీరిలో వెంకటేశ్వర్లు మృతదేహాన్ని స్థానికులు, మిగిలిన బృంద సభ్యులతో కలిసి వెలికితీశారు. ప్రదీప్‌ గల్లంతయ్యారు. ఖమ్మం మున్సిపాలిటీలో స్థానికంగా ‘డీఆర్‌ఎఫ్‌’ పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ విపత్తు నిర్వహణ బృందానికి తగిన శిక్షణ ఇవ్వకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని