అక్రమాలను ఎత్తి చూపడమే నేరమైంది!

అక్రమ మట్టి తవ్వకాలపై ఒక వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశాడనే కక్షతో వైకాపా నాయకులు అతని ఇంటి పైకి వెళ్లి మారణాయుధాలతో దాడి చేసిన సంఘటన బుధవారం అర్ధరాత్రి

Updated : 12 Aug 2022 06:06 IST

కక్షతో వ్యక్తిపై దాడికి పాల్పడ్డ వైకాపా నాయకులు

తర్లుపాడు, న్యూస్‌టుడే: అక్రమ మట్టి తవ్వకాలపై ఒక వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశాడనే కక్షతో వైకాపా నాయకులు అతని ఇంటి పైకి వెళ్లి మారణాయుధాలతో దాడి చేసిన సంఘటన బుధవారం అర్ధరాత్రి ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో చోటు చేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలోని ప్రభుత్వ భూమిలో వైకాపా ముఖ్య నాయకులు కొందరు రోజూ జేసీబీలు, టిప్పర్లు, ట్రాక్టర్ల సాయంతో మట్టి తవ్వకాలు చేసి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందాపై మార్కాపురం భూగర్భ గనులశాఖ అధికారులకు స్థానికుడైన కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. అ శాఖ అధికారులు బుధవారం రాత్రి నిఘా పెట్టి మట్టి తవ్వకాలను అడ్డుకొని వాహనాలను సీజ్‌ చేశారు. రాజకీయ నాయకులు ఒత్తిడి తెచ్చినా వాహనాలను విడిచి పెట్టలేదు. వాహనాలను తరలిస్తుంటే మార్గమధ్యలో వైకాపా కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా సీజ్‌ చేసిన వాహనాలను అధికారులు మార్కాపురం తరలించి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. దీంతో రగిలిపోయిన ఇద్దరు అధికార పార్టీ నాయకులు.. ఫిర్యాదు చేసిన కృష్ణారెడ్డి ఇంటి పైకి వెళ్లారు. అతడిని ఇంటి బయటకు లాక్కొచ్చి కత్తి, ఇనుప రాడ్డుతో దాడికి పాల్పడ్డారు. గాయపడ్డ బాధితుడిని కుటుంబసభ్యులు ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి తర్లుపాడు స్టేషన్‌కు పంపినట్లు పోలీసు సిబ్బంది తెలిపారు. ఇదే నాయకులు జగనన్న కాలనీల్లో పేదలకు ఇచ్చిన స్థలాలను ఆక్రమించుకొని ఇళ్లు నిర్మించుకున్నారని గతంలో కృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని