మందుగుండు అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టు

స్వాతంత్య్ర దినోత్సవ సమయంలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను దిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 2,251 తూటాలను స్వాధీనం

Updated : 13 Aug 2022 06:15 IST

దిల్లీలో 2,251 తూటాల స్వాధీనం

ఆరుగురు నిందితుల అరెస్టు

ఉగ్ర కోణంలో దర్యాప్తు

దిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవ సమయంలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను దిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 2,251 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీలకు చెందిన ఓ ముఠా పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రిని అక్రమంగా చేరవేస్తున్నట్లు గుర్తించారు. ఈనెల 6న ఓ ఆటోరిక్షా డ్రైవర్‌ ఇచ్చిన సమాచారం మేరకు దిల్లీలోని ఆనంద్‌విహార్‌ అంతర్రాష్ట్ర బస్‌ టెర్మినల్‌ వద్ద పెద్ద పెద్ద బ్యాగులను మోసుకెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా ముఠా కార్యకలాపాలు బయటపడ్డాయి. దేహ్రాదూన్‌లోని తుపాకుల వ్యాపారి నుంచి సేకరించిన మందుగుండును దిల్లీ మీదుగా లఖ్‌నవూకు, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు చేరవేస్తున్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించి వివిధ ప్రాంతాల్లో సోదాలు జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన వారిలో అజ్మల్‌, రషీద్‌ అలియాస్‌ లలన్‌, సద్దామ్‌...ఉత్తర్‌ప్రదేశ్‌కు, పరిక్షిత్‌ నేగి, నాసిర్‌.. ఉత్తరాఖండ్‌కు, కమ్రాన్‌ దిల్లీకి చెందిన వారుగా గుర్తించినట్లు దిల్లీ అదనపు పోలీస్‌ కమిషనర్‌(ఈస్ట్రన్‌ రేంజ్‌) విక్రమ్‌జిత్‌ సింగ్‌ శుక్రవారం తెలిపారు. మరికొందరు కూడా ఈ ముఠాలో ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఉగ్రవాదుల ప్రమేయాన్ని తోసిపుచ్చలేమని, ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీస్‌ అధికారి తెలిపారు.

కోల్‌కతాలో ఇద్దరు బంగ్లాదేశీయుల అరెస్టు 

అనుమతి లేకుండా డ్రోన్‌ను ఎగురవేయడంతో పాటు ప్రసిద్ధ విక్టోరియా మెమోరియల్‌ హాలు, దాని పరిసరాలను చిత్రీకరిస్తున్న ఇద్దరు బంగ్లాదేశీయులను కోల్‌కతా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. విక్టోరియా మెమోరియల్‌ హాలుకు సమీపంలోని ఫోర్ట్‌ విలియంలో భారత సైన్యానికి చెందిన ఈస్ట్రన్‌ కమాండ్‌ ప్రధాన కార్యాలయం ఉండడంతో ఈ ప్రాంతాన్ని ‘నో డ్రోన్‌’ జోన్‌గా ప్రకటించారు. నిషేధిత ప్రాంతంలో బంగ్లాదేశీయుల కదలికలను గుర్తించిన భద్రతా సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని