శ్రీవారి దర్శన టికెట్లు అధిక ధరలకు విక్రయించిన తితిదే అధికారిపై కేసు

శ్రీవారి దర్శన టికెట్లు, గదుల కేటాయింపు పేరుతో భక్తులను మోసగిస్తున్న తితిదే అధికారితో పాటు ఐదుగురు దళారులపై తిరుమల టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ

Updated : 13 Aug 2022 06:43 IST

ఐదుగురు దళారులపై కూడా

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి దర్శన టికెట్లు, గదుల కేటాయింపు పేరుతో భక్తులను మోసగిస్తున్న తితిదే అధికారితో పాటు ఐదుగురు దళారులపై తిరుమల టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ చంద్రశేఖర్‌ తెలిపిన వివరాల మేరకు.. విశాఖపట్నంలోని తితిదే సమాచారకేంద్రంలో హెచ్‌డీపీపీ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఎం.మల్లిఖార్జున.. కాటసాని విజయకుమారి, నవ్యశ్రీ, నోముల వెంకటమురళీకృష్ణ, టి.గణేష్‌ వెంకటసుబ్బారావు, ఉప్పల వంశీకృష్ణలు(దళారులు) ఓ ముఠాగా ఏర్పడి ప్రముఖుల నుంచి సిఫారసు లేఖలను సంపాదించారు. వాటితో సుప్రభాతం, బ్రేక్‌ దర్శనం, కల్యాణం, గదులను పొంది వాటిని భక్తులకు అధిక ధరలకు విక్రయించేవారు. ఆరు నెలల కాలంలో 700 మందికి పైగా దర్శన టికెట్లను విక్రయించి భారీగా నగదు సంపాదించినట్లు తితిదే నిఘా, భద్రతా విభాగం గుర్తించింది. ఇందులో 350 మందికి బ్రేక్‌, 350 మందికి రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం, 12 కల్యాణోత్సవ టికెట్లను విక్రయించినట్లు సమాచారం. నిందితులపై తితిదే విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.శంకర్‌బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని