సర్పంచి భర్త దారుణ హత్య

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం సర్పంచి గాదే సంధ్య భర్త విజయ్‌రెడ్డి శనివారం సాయంత్రం దారుణహత్యకు గురయ్యారు. పొలం పనులు

Published : 14 Aug 2022 05:35 IST

రాజకీయ కక్షలతోనేనని కుటుంబ సభ్యుల ఆరోపణ

ఈనాడు, నల్గొండ, తిప్పర్తి న్యూస్‌టుడే: నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం సర్పంచి గాదే సంధ్య భర్త విజయ్‌రెడ్డి శనివారం సాయంత్రం దారుణహత్యకు గురయ్యారు. పొలం పనులు ముగించుకొని ఎల్లమ్మగూడెం కాలువ కట్ట దారిలో సాయంత్రం బైక్‌పై ఇంటికి వస్తుండగా.. ఎదురుగా కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు తొలుత ఆయన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. అనంతరం కత్తులు, గొడ్డళ్లతో విచక్షణా రహితంగా దాడి చేయడంతో విజయ్‌రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలువదిలాడు. పోలీసులు, ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. 2019లో జరిగిన ఎన్నికల్లో మృతుడి భార్య సంధ్య తెరాస మద్దతుతో సర్పంచిగా ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో తెరాస నుంచి ఎంపీటీసీ టిక్కెట్‌ దక్కకపోవడంతో విజయ్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో ఆయన్ను 2019లోనే తెరాస నుంచి సస్పెండ్‌ చేశారు. అనంతరం కాంగ్రెస్‌, భాజపాల్లో కొంత కాలం పనిచేశారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని అధికారులు పలుమార్లు ఆయన భార్య సంధ్య చెక్‌పవర్‌ను రద్దు చేశారు. నల్గొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి తాము గ్రామాభివృద్ధికి ఖర్చుపెట్టిన బిల్లులను ఆపడంతో పాటు సర్పంచి చెక్‌పవర్‌ను రద్దు చేస్తూ వేధిస్తున్నారని విజయ్‌రెడ్డి పలుమార్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. తన భర్త హత్యలో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో పాటు ఎంపీటీసీ సభ్యుడు ఊట్కూరి సందీప్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సందీప్‌రెడ్డి, సునందరెడ్డి, ప్రవీణ్‌రెడ్డి హస్తం ఉందని మృతుడి భార్య సంధ్య ఆరోపిస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘విజయ్‌రెడ్డి భార్యకు నేనే సర్పంచిగా టిక్కెట్‌ ఇచ్చి గెలిపించాను. ఎంపీటీసీ టిక్కెట్‌ కూడా తనకు కావాలని అడిగితే ఒకే కుటుంబానికి అన్ని పదవులు రావని చెప్పి వేరే వారికి ఇచ్చాం. దీంతో ఆయన స్వతంత్రంగా పోటీ చేసి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడంతో సస్పెండ్‌ చేశాం. అప్పటి నుంచి కాంగ్రెస్‌, భాజపా అంటూ తిరిగారు. ఆయన వెంట ఉన్న వాళ్లే ఆయన్ను హత్య చేసి ఉండొచ్చ’’న్నారు.

భూ వివాదాలే కారణమా?
విజయ్‌రెడ్డి హత్యకు గత కొన్నాళ్లుగా సాగుతున్న భూ వివాదాలే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మండలంలో జరిగే అవకతవకలను విజయ్‌రెడ్డి సమాచారహక్కు చట్టం ద్వారా వెలుగులోకి తేవడంతో కొంత మంది అధికారులు ఇబ్బందులు పడ్డారని, స్థానికంగా ఉన్న కొన్ని భూ వివాదాలపైనా ఆయన కోర్టుకు వెళ్లారని తెలిసింది. ఈ కారణాలతోనే ఆయనను సుపారీ ఇచ్చి హత్య చేయించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు శాలి గౌరారం సీఐ రాఘవరావు ‘ఈనాడు’కు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని