రోడ్డు ప్రమాదంలో నలుగురు స్నేహితుల దుర్మరణం

చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదంలో నలుగురు స్నేహితులు దుర్మరణం చెందారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పోలీసుస్టేషన్‌ పరిధిలోని తుమ్మలపాలెం పరిసరాల్లో రహదారి పక్కనే

Published : 16 Aug 2022 06:47 IST

ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొన్న కారు
గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం

ఈనాడు-గుంటూరు, న్యూస్‌టుడే-ప్రత్తిపాడు: చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదంలో నలుగురు స్నేహితులు దుర్మరణం చెందారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పోలీసుస్టేషన్‌ పరిధిలోని తుమ్మలపాలెం పరిసరాల్లో రహదారి పక్కనే ఆగి ఉన్న లారీని వెనకనుంచి స్నేహితులు ప్రయాణిస్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొనటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువతులు, ఒక యువకుడు సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో యువతి తీవ్ర గాయాలపాలై రక్తమోడుతుండగా గుంటూరు ప్రభుత్వ బోధనాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు. విశాఖలో ఆర్కిటెక్చర్‌ విద్య కలిసి చదువుకున్న స్నేహితులు.. వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వారంతా అరుణాచలం దైవదర్శనానికి వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. ప్రమాద సమయంలో కారు స్పీడోమీటర్‌ 90 కి.మీ.వద్ద ఉంది. విజయవాడ నుంచి చిలకలూరిపేట వైపు అతివేగంగా వెళుతూ జాతీయ రహదారిపై నాలుగో లైనులో పంక్చర్‌ పడి ఆగి ఉన్న లారీని బ్రేకులు వేయకుండానే ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని భావిస్తున్నారు. ఆగి ఉన్న లారీ సైతం మూడడుగులు ముందుకు కదిలింది. లారీ డ్రైవర్‌ అక్కడినుంచి పరారయ్యాడు. మృతులను విజయవాడ చేపల మార్కెట్‌ ప్రాంతానికి చెందిన గౌతంరెడ్డి (26), కాకినాడ జగన్నాథపురానికి చెందిన వాడపల్లి అనంత పద్మనాభ చైతన్య పవన్‌ (25), విజయనగరం జిల్లా కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెంకు చెందిన పిండి సౌమ్యక (25)గా గుర్తించారు. మరో మృతురాలు పావని(24) వివరాలు తెలియరాలేదు. మృతుడు గౌతమ్‌రెడ్డి ఆధార్‌ కార్డు ఆధారంగా ఆయన కుటుంబీకుల నుంచి మిగిలిన మృతుల వివరాలను సేకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని