తుమ్మల అనుచరుడి దారుణ హత్య

ఖమ్మం జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవం రోజే రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. ఖమ్మం గ్రామీణ మండలంలోని తెల్దారుపల్లికి చెందిన తెరాస నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన

Updated : 16 Aug 2022 06:15 IST

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి స్వగ్రామంలో ఘటన
జాతీయ జెండా ఎగురవేసి వస్తుండగా తెరాస నేతపై దుండగుల దుశ్చర్య

ఈటీవీ ఖమ్మం- ఖమ్మం గ్రామీణం, న్యూస్‌టుడే: ఖమ్మం జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవం రోజే రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. ఖమ్మం గ్రామీణ మండలంలోని తెల్దారుపల్లికి చెందిన తెరాస నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య (62) సోమవారం దారుణహత్యకు గురయ్యారు. ఈ ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కలకలం రేపింది. సోమవారం ఉదయం కృష్ణయ్య పొన్నెకల్లు రైతు వేదిక వద్ద జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం తన అనుచరుడితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా తెల్దారుపల్లి సమీపంలో.. వెనుక నుంచి ఆటోలో వచ్చిన దుండగులు ఆయన వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో కృష్ణయ్య, ఆయన అనుచరుడు ముత్తేశం రహదారి పక్కన కాలువలో పడిపోయారు. దుండగులు ఆటోలో నుంచి దిగి వేటకొడవళ్లతో కృష్ణయ్యపై విచక్షణారహితంగా దాడి చేశారు. రెండు చేతులు నరికేశారు. తలపై కత్తులతో నరకడంతో తీవ్ర రక్తస్రావమై కృష్ణయ్య అక్కడికక్కడే మృతి చెందారు. కృష్ణయ్య టేకులపల్లి ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య మంగతాయి తెల్దారుపల్లి ఎంపీటీసీ సభ్యురాలు. వీరికి కుమారుడు నవీన్‌, కుమార్తె రజిత ఉన్నారు.

హత్య విషయం తెలిసి.. నిమిషాల వ్యవధిలోనే గ్రామస్థులు, ఆయన అనుచరులు, అభిమానులు పెద్దసంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు సీపీఎం నాయకుడు తమ్మినేని కోటేశ్వరరావు ప్రధాన కారణమని ఆరోపిస్తూ ఆయన ఇంటిపై దాడికి పాల్పడ్డారు.  కోటేశ్వరరావుకు చెందిన గ్రానైట్‌ క్వారీలోని పొక్లెయిన్‌ను తగలబెట్టారు. తెల్దారుపల్లి.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్వగ్రామం కాగా.. కోటేశ్వరరావు స్వయనా సోదరుడు. హతుడు కృష్ణయ్య సైతం బాబాయి కుమారుడే కావడం గమనార్హం. కృష్ణయ్య శరీరంపై 15 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూడేళ్ల క్రితం తమ్మినేని కృష్ణయ్య సీపీఎం నుంచి తెరాసలో చేరారు. సీపీఎంకు వ్యతిరేకంగా తన భార్యను స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీటీసీ ఎన్నికల బరిలో నిలిపి విజయం సాధించారు.  

ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో కృష్ణయ్య మృతదేహానికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాళి అర్పించారు. హత్య ఘటనపై మంత్రి కేటీఆర్‌తో ఫోన్లో మాట్లాడారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా డీజీపీని ఆదేశించాలని కోరారు. తెల్దారుపల్లిలో కృష్ణయ్య కుటుంబీకులను పరామర్శించారు. ఈ హత్యలో తమ్మినేని వీరభద్రం, ఆయన సోదరుడు కోటేశ్వరరావు పాత్ర ఉందని కృష్ణయ్య భార్య మంగతాయి, కుమార్తె రజిత ఆరోపించారు. తమ్మినేని కోటేశ్వరరావు హత్య చేయించారని కృష్ణయ్య కుమారుడు నవీన్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో ఆరుగురి పేర్లు చేర్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని