చెట్లు నరికారన్నా.. చలించరేందన్నా?

నెల్లూరు జిల్లా అనుమసముద్రంపేట మండలం పెద్దఅబ్బీపురంలో వైకాపా నాయకులు ఈ నెల 12న రాత్రి తమ తోటలోని 95 మామిడి చెట్లు నరికేశారంటూ... పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతూ

Published : 17 Aug 2022 09:33 IST

వైకాపా నాయకులపై బాధితుడి ఫిర్యాదు
పోలీసులు పట్టించుకోవడంలేదని ఆత్మహత్యా యత్నం

ఆత్మకూరు, న్యూస్‌టుడే: నెల్లూరు జిల్లా అనుమసముద్రంపేట మండలం పెద్దఅబ్బీపురంలో వైకాపా నాయకులు ఈ నెల 12న రాత్రి తమ తోటలోని 95 మామిడి చెట్లు నరికేశారంటూ... పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతూ వెంగయ్య అనే రైతు కుటుంబం మంగళవారం ఆత్మకూరులో ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. బాధితులు తెలిపిన ప్రకారం... పెద్ద అబ్బీపురం పంచాయతీలో గతంలో పనులు చేయకుండానే నిధులు స్వాహా చేశారని వెంగయ్య నాయకత్వంలో కొందరు గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు... నిధుల స్వాహా నిజమేనని తేల్చి.. రికవరీకి ఆదేశించారు. నాటి నుంచి వైకాపా నాయకులు వెంగయ్యపై కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో వెంగయ్యకు చెందిన 95 మామిడి చెట్లు నరికివేతకు గురయ్యాయి. విద్యుత్తు మోటారు, పైపులైన్లు ధ్వంసమయ్యాయి. స్థానిక వైకాపా నాయకులను అనుమానితులుగా పేర్కొంటూ బాధిత రైతు 13న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించడంలేదని ఆవేదనకు గురైన వెంగయ్య, అతని కుటుంబ సభ్యులు ఆత్మకూరులోని బీఎస్‌ఆర్‌ సెంటర్‌లో బైఠాయించారు. పురుగుమందు తాగేందుకు యత్నించగా పక్కనే ఉన్న కానిస్టేబుల్‌ అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకటేశ్వరరావు అక్కడికి చేరుకుని... బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆర్డీవో కరుణకుమారికి సైతం వినతిపత్రం అందజేశారు. విషయాన్ని పరిశీలిస్తామని ఆమె భరోసా ఇచ్చారు. వైకాపా నాయకులకు పోలీసులు సహకరిస్తున్నారని జనసేన ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి నలిశెట్టి శ్రీధర్‌ ఆరోపించారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని