విద్యుత్తుశాఖ ఏఈఈపై వైకాపా నాయకుల దాడి

బకాయిల వసూలుకు వెళ్లిన విద్యుత్తుశాఖ అధికారిపై వైకాపా నాయకులు దాడి చేశారు. అధికారి, సిబ్బంది, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాయంపల్లిలో 30 మందికిపైగా గృహ

Published : 18 Aug 2022 05:11 IST

ఉరవకొండ, న్యూస్‌టుడే: బకాయిల వసూలుకు వెళ్లిన విద్యుత్తుశాఖ అధికారిపై వైకాపా నాయకులు దాడి చేశారు. అధికారి, సిబ్బంది, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాయంపల్లిలో 30 మందికిపైగా గృహ విద్యుత్తు వినియోగదారులు రూ.10 లక్షల వరకు బిల్లుల బకాయి ఉన్నారు. వాటి వసూలుకు ఏఈఈ గురుమూర్తి సిబ్బందితో కలిసి బుధవారం గ్రామానికి వెళ్లారు. బకాయి ఉన్న అధికారపార్టీ గ్రామ నాయకుడి ఇంటి విద్యుత్తు కనెక్షన్‌ తొలగించారు. తొలగింపును ఆపాలని ఆయన బంధువు, నెరమెట్ల సర్పంచి యోగేందర్‌రెడ్డి ఏఈఈకి ఫోన్‌ చేసి చెప్పారు. పైఅధికారుల నుంచి ఒత్తిడి ఉందని, వారితో అనుమతి ఇప్పిస్తే కనెక్షన్‌ ఇస్తామని ఏఈఈ సమాధానమిచ్చారు. అనంతరం రాయంపల్లి చేరుకున్న నెరమెట్ల సర్పంచి ఏఈఈతో దురుసుగా మాట్లాడారు. మాటమాట పెరిగి సర్పంచి, స్థానిక వైకాపా నాయకులు ఏఈఈపై చెప్పుతో దాడిచేశారు. గుర్తించిన గ్రామస్థులు, సచివాలయ ఉద్యోగులు ఏఈఈని సచివాలయంలో కూర్చోబెట్టారు. అక్కడికి గుంపుగా చేరుకున్న నాయకులు మరోసారి ఆయనపై దాడి చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఏఈఈని బందోబస్తు నడుమ ఉరవకొండకు తరలించారు. దాడిపై గురుమూర్తి సీఐ హరినాథ్‌కు ఫిర్యాదుచేశారు. ఏఈఈ తమతో దురుసుగా ప్రవర్తించి, దాడిచేసి చొక్కా చించారని, స్థానిక దళిత మహిళలతోనూ దురుసుగా ప్రవర్తించారని సర్పంచి యోగేందర్‌రెడ్డి ఉరవకొండ మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు