Published : 18 Aug 2022 05:11 IST

గోవా కేంద్రంగా డ్రగ్స్‌ దందా

తెలంగాణ, ఏపీల్లో పలువురికి సరఫరా
ప్రధాన నిందితుడి అరెస్టు

ఈనాడు- హైదరాబాద్‌, ఉస్మానియా యూనివర్సిటీ, చంచల్‌గూడ, న్యూస్‌టుడే: గోవా కేంద్రంగా భారీ నెట్‌వర్క్‌తో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ప్రధాన సూత్రధారి ప్రీతీష్‌ నారాయణను హైదరాబాద్‌లోని హబ్సిగూడలో మంగళవారం నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో, ఓయూ పోలీసులు పట్టుకున్నారు. ఇతడు ఎనిమిదేళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో దాదాపు 600 మందికి డ్రగ్స్‌ సరఫరా చేశాడు. వారిలో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖులు, వ్యాపారులు 166 మంది వరకు ఉన్నారు. నిందితుడి నుంచి 20 ఎక్స్టసీ మాత్రలు, 5 ఎల్‌ఎస్‌డీ బ్లాట్లు, 4 గ్రాముల ఎండీఎంఏ, ఒక సెల్‌ఫోన్‌, రూ.4 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ఈస్ట్‌జోన్‌ డీసీపీ చక్రవర్తి బుధవారం విలేకరులకు వెల్లడించారు. ‘గోవాకు చెందిన ప్రీతీష్‌ నారాయణ్‌ బోర్కర్‌ అలియాస్‌ బాబు అలియాస్‌ కాళీ.. ఆ ప్రాంతంలోని మంజూర్‌ అహ్మద్‌తో కలిసి డ్రగ్స్‌ సరఫరా చేస్తుంటాడు. తుకారం సాల్గోవ్కర్‌ అలియాస్‌ నానా, వికాస్‌ నాయక్‌ అలియాస్‌ విక్కీ, రమేశ్‌ చౌహాన్‌, స్టీవ్‌, ఎడ్విన్‌ నునిస్‌, సంజా గోవేకర్‌ దగ్గరి నుంచి తక్కువ ధరకు డ్రగ్స్‌ కొని వినియోగదారులకు ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు. మత్తు పదార్థాలు విక్రయించేందుకు పలుమార్లు తెలంగాణ, ఏపీలకు వచ్చాడు. ఇతడు గతంలోనూ గోవాలో నార్కోటిక్‌ అధికారులకు పట్టుబడినా, దందా ఆపలేదు. మంగళవారం హబ్సిగూడలోని కాకతీయనగర్‌లో కొందరికి డ్రగ్స్‌ విక్రయించేందుకు వస్తున్నాడని తెలియడంతో పోలీసులు వలపన్ని అతడిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్‌ కొన్న వారిలో కొందరిని గుర్తించారు.. మరికొందరిని గుర్తించాల్సి ఉంది’ అని తెలిపారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసులకు డీసీపీ రివార్డులను అందజేశారు. హెచ్‌-న్యూ అదనపు డీసీపీ స్నేహ, ఇన్స్‌పెక్టర్‌ పి.రాజేష్‌, ఎస్‌ఐ దినేష్‌, కానిస్టేబుల్‌ సత్యనారాయణ, ఓయూ ఇన్స్‌పెక్టర్‌ రమేష్‌నాయక్‌లను అభినందించారు.

డ్రగ్‌ పెడ్లర్‌ టోనీ విడుదల

అంతర్జాతీయ డ్రగ్‌ పెడ్లర్‌ టోనీ బుధవారం చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇతడిని అదుపులోకి తీసుకోవడంతో మాదకద్రవ్యాల సరఫరా కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉందని గతంలో పోలీసులు ప్రకటించారు. ఈ ఏడాది జనవరిలో నగ[ర పోలీసులు అతడిని ముంబయిలో అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. టోనీ వీసా గడువు ముగిసినా 2013 నుంచి ముంబయిలో ఉన్నట్లు సమాచారం. నైజీరియాకు చెందిన అతడి అసలు పేరు చుకువూ ఒగబొన్నా డేవిడ్‌.  టోనీ.. మాదకద్రవ్యాల కేసుల్లో ఇటీవల సంచలనం రేకెత్తించిన పేరు. రూ.వందల కోట్ల డ్రగ్‌ మాఫియాకు ప్రధాన సూత్రధారి. ఇతను ప్రత్యేకంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని బెంగళూరు, ముంబయి సహా దేశవ్యాప్తంగా డ్రగ్స్‌ సరఫరా చేయించేవాడు. నగరంలోని కొందరు సినీతారలకూ విక్రయించినట్లు ఆరోపణలున్నాయి. 2013లో నైజీరియా నుంచి తాత్కాలిక వీసా మీద దేశానికి వచ్చి .. గడువు ముగిసినా ముంబయిలోని ఈస్ట్‌ అంథేరిలో ఉంటూ డ్రగ్స్‌ దందా నడిపించాడు.  విక్రయించేందుకు తన ముఠా సభ్యుడిని హైదరాబాద్‌కు పంపించడంతో గుట్టు బయటపడింది. తొలుత టోనీ ముఖ్య అనుచరుడు ఇమ్రాన్‌ పంజాగుట్టలో పట్టుబడ్డాడు. తర్వాత దర్యాప్తుతో మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేశారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని