కూలిన పాఠశాల వరండా పైకప్పు

పాఠశాల భవనం వరండా పైకప్పు కూలి ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గురువారం జరిగిన ఘటనతో విద్యార్థులు హడలిపోయారు. ఎదిర ప్రాథమికోన్నత పాఠశాలలో

Published : 19 Aug 2022 03:56 IST

ముగ్గురు విద్యార్థులకు గాయాలు
ఒకరి పరిస్థితి విషమం

వెంకటాపురం, న్యూస్‌టుడే: పాఠశాల భవనం వరండా పైకప్పు కూలి ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గురువారం జరిగిన ఘటనతో విద్యార్థులు హడలిపోయారు. ఎదిర ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటి నుంచి ఎనిమిది తరగతుల వరకు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 116 మంది విద్యార్థులున్నారు. ప్రాంగణంలో నాలుగు భవనాలు ఉండగా రెండు శిథిలావస్థకు చేరుకుని నిరుపయోగంగా ఉన్నాయి. మిగిలిన రెండు భవనాలకుగానూ ఒక దానిలో ప్రాథమిక తరగతులు, మరో దానిలో ఏడు, ఎనిమిది తరగతులు నిర్వహిస్తున్నారు. గురువారం మధ్నాహ్న భోజన విరామ సమయంలో ఈ భవనం వైపు పది మంది ప్రాథమిక తరగతుల చిన్నారులు వెళ్లారు. గదుల్లోకి వెళ్తున్న సమయంలోనే భవనం వరండా పైకప్పు(సన్‌షేడ్‌) ఒక్కసారిగా కూలింది. కమ్ములు, పెంకులు, కంకర శిథిలాలు విద్యార్థులపై పడ్డాయి. మూడో తరగతి విద్యార్థిని ఎస్‌.నిఖిత, రెండో తరగతి విద్యార్థి రిషిత్‌రైనా, ఒకటో తరగతి విద్యార్థి ఎస్‌.సంతోష్‌ గాయపడ్డారు. ఉపాధ్యాయులు హుటాహుటిన అక్కడికి చేరుకుని బాధిత చిన్నారులను ఎదిరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అక్కణ్నుంచి ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు. తలకు గాయాలైన నిఖిత, రిషిత్‌రైనా వాంతులు చేసుకోవడంతో వైద్యుల సూచనల మేరకు వరంగల్‌కు తరలించినట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. భోజన విరామంలో ఎక్కువ మంది అక్కడ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని ఉపాధ్యాయులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని