Cyber Crime: కొవిడ్ రిలీఫ్ ఫండ్ వచ్చిందన్నారు.. రూ.లక్షలు కొట్టేశారు

‘మీరు కొవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌కు అర్హత సాధించారు.. మీ పూర్తి వివరాలు పంపితే 25 వేల పౌండ్లు(సుమారు రూ.23.50 లక్షలు) ఉన్న పార్సిల్‌ మీకు పంపిస్తాం.. దాన్ని తీసుకునేందుకు కస్టమ్స్‌ ఛార్జీలు, జీఎస్టి మనీ కన్వర్షన్‌ ఛార్జీలు చెల్లించండి... పార్సిల్‌ చేతికి ఇస్తామంటూ రకరకాల రుసుముల పేరు చెప్పి లక్షలు వసూలు

Updated : 20 Aug 2022 09:52 IST

వెలుగులోకి కొత్త తరహా సైబర్‌ నేరం

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : ‘మీరు కొవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌కు అర్హత సాధించారు.. మీ పూర్తి వివరాలు పంపితే 25 వేల పౌండ్లు(సుమారు రూ.23.50 లక్షలు) ఉన్న పార్సిల్‌ మీకు పంపిస్తాం.. దాన్ని తీసుకునేందుకు కస్టమ్స్‌ ఛార్జీలు, జీఎస్టి మనీ కన్వర్షన్‌ ఛార్జీలు చెల్లించండి... పార్సిల్‌ చేతికి ఇస్తామంటూ రకరకాల రుసుముల పేరు చెప్పి లక్షలు వసూలు చేశారు. ఆ తరువాత ఎందుకు పనికి రాని ఒక కవర్‌ చేతికి ఇచ్చారు’. సరికొత్త తరహాలో జరిగిన ఈ సైబర్‌ నేరం విజయవాడలో తాజాగా వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పాత రాజరాజేశ్వరీపేటకు చెందిన ఖాజా బాబు (43) ఆటోనగర్‌లో ఆటోమొబైల్‌ దుకాణం నిర్వహిస్తుంటారు. 2022, మార్చి 11న ఆయన చరవాణికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి కొవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌కు మీరు అర్హత సాధించారంటూ ఒక వాట్సాప్‌ మెసేజ్‌ వచ్చింది. దీని కోసం వివరాలు పంపమనగా ఖాజాబాబు తన వివరాలను పంపించారు. ఆ తరువాత అతనికి ఫోన్‌ చేసి మార్చి 12న ఒక పార్సిల్‌ పంపిస్తున్నామని చెప్పారు. మార్చి 14న ఒక వ్యక్తి ఫోన్‌ చేసి ఖాజాబాబు పేరిట 25 వేల పౌండ్లు ఉన్న ఒక పార్సిల్‌ వచ్చిందని చెప్పారు. కస్టమ్స్‌ ఛార్జీల నిమిత్తం రూ.38,950 చెల్లించాలని చెప్పటంతో ఖాజాబాబు నమ్మారు. గూగుల్‌ పే ద్వారా ఆ సొమ్ము చెల్లించారు. ఆ తరువాత జీఎస్టి మనీ కన్వర్షన్‌ ఛార్జీలు కట్టాలనటంతో రూ.1,15,500, రూ.2,98,900 చెల్లించారు. మళ్లీ మార్చి 15న ఫోన్‌ చేసి రకరకాల చార్జీలు పేరు చెప్పి మరింత వసూలు చేశారు.

ఇలా ఖాజాబాబు మొత్తం రూ.9,79,300 చెల్లించారు. ఆ తరువాత మార్చి 22న ఖాజాబాబుకు పార్సిల్‌ వచ్చింది. అందులో ఏటీఎం కార్డు, పిన్‌ నంబరు ఉండటంతో దాన్ని ఉపయోగించి బ్యాంకులో నుంచి డబ్బులు తీసేందుకు ప్రయత్నించారు. ఆయన కేవలం రూ.1000 మాత్రమే తీసుకోగలిగారు. ఆ తరువాత కార్డు పనిచేయకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించి సైబర్‌ క్రైం పోలీసులను బుధవారం రాత్రి ఆశ్రయించారు. సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని