రాష్ట్రంలో అరెస్టుల పర్వం

రాష్ట్రంలో అరెస్టులు భారీగా పెరిగాయి. 2020తో పోలిస్తే 2021లో 27,179 మంది (33.60 శాతం) ఎక్కువగా అరెస్టయ్యారు. 2020లో వివిధ కేసుల్లో 80,869 మంది అరెస్టు కాగా.. 2021లో

Published : 04 Sep 2022 04:29 IST

2021లో 1.08 లక్షల మంది అరెస్టు

కారాగార గణాంక నివేదిక-2021లో వెల్లడి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో అరెస్టులు భారీగా పెరిగాయి. 2020తో పోలిస్తే 2021లో 27,179 మంది (33.60 శాతం) ఎక్కువగా అరెస్టయ్యారు. 2020లో వివిధ కేసుల్లో 80,869 మంది అరెస్టు కాగా.. 2021లో ఆ సంఖ్య 1,08,048 అయ్యింది. కేంద్ర హోంశాఖ శనివారం విడుదల చేసిన ‘కారాగార గణాంక నివేదిక- 2021’ ఈ వివరాల్ని వెల్లడించింది. వైకాపా ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలతోపాటు రాజకీయంగా గిట్టనివారిని, ప్రభుత్వ, పాలనా విధానాల్లోని లోపాల్ని ఎత్తి చూపేవారిని, సామాజిక మాధ్యమాల్లో గళమెత్తే వారిని అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తోందంటూ ప్రతిపక్షాలు తొలి నుంచి ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా గణాంకాలు అదే విషయాన్ని సూచిస్తున్నాయి. గతేడాదిలో దేశవ్యాప్తంగా అరెస్టయిన వారి సంఖ్య అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ది అయిదో స్థానం. ఉత్తర్‌ప్రదేశ్‌ (2,71,084), బిహార్‌ (2,70,934), మధ్యప్రదేశ్‌ (1,28,019), పశ్చిమబెంగాల్‌ (1,13,697) తర్వాత ఎక్కువ మంది అరెస్టయింది మన రాష్ట్రంలోనే. ఈ అంశంలో 2019లో 12వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ 2020లో ఆరో స్థానానికి, ఇప్పుడు 5వ స్థానానికి చేరడం గమనార్హం.

అసాధారణంగా పెరిగిన అరెస్టులు
* ఆంధ్రప్రదేశ్‌లో గత ఆరేళ్ల గణాంకాల్ని పరిశీలిస్తే ఎన్నడూ లేని విధంగా వైకాపా ప్రభుత్వ హయాంలో అరెస్టులు అసాధారణంగా పెరిగాయి.

* 2018 కంటే 2019లో 5,611 మంది ఎక్కువగా అరెస్టయ్యారు. 2019 తర్వాత నుంచి అరెస్టయిన వారి సంఖ్య విపరీతంగా పెరిగింది.

* ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, నాయకులు సహా ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై పెద్ద ఎత్తున అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయటంవల్లే ఈ సంఖ్య విపరీతంగా పెరిగిందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. పోలీసుల్ని అడ్డం పెట్టుకుని వైకాపా ప్రభుత్వం రాజకీయంగా వేధిస్తోందనడానికి, అక్రమ కేసులకు ఈ గణాంకాలే తార్కాణమని పేర్కొంటోంది.

* 2018తో పోల్చితే 2019లో అరెస్టయిన వారి శాతం 9.13 శాతం మేర పెరిగింది. 2019తో పోల్చితే 2020లో 20.64, 2020 కంటే 2021లో 33.60 శాతం పెరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని