Asifabad: నిర్లక్ష్యమే.. ప్రాణాలు తీసింది

తెలిసీ తెలియని వయసు.. తెల్లనివన్నీ పాలని, నల్లనివన్నీ నీళ్లని నమ్మే అమాయకత్వం.. అలాగే ఓ చిన్నారి శీతల పానీయంలో ఉన్నది క్రిమిసంహారక మందు అని తెలియక

Updated : 19 Sep 2022 08:17 IST

శీతల పానీయం అనుకొని పురుగుమందు తాగిన చిన్నారి

పది ఆసుపత్రులు తిరిగినా దక్కని ఫలితం

అన్ని చోట్లా నిరాకరణే

ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే: తెలిసీ తెలియని వయసు.. తెల్లనివన్నీ పాలని, నల్లనివన్నీ నీళ్లని నమ్మే అమాయకత్వం.. అలాగే ఓ చిన్నారి శీతల పానీయంలో ఉన్నది క్రిమిసంహారక మందు అని తెలియక తాగేసింది. తల్లిదండ్రులు ఎన్ని ఆసుపత్రులకు తీసుకెళ్లినా చికిత్సకు ఎవరూ ముందుకు రాలేదు. తమ గారాలపట్టిని బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రాణాలు దక్కలేదు. ఈ హృదయవిదారక ఘటన కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌ మండలం భీంపూర్‌లో చోటుచేసుకుంది. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భీంపూర్‌ గ్రామానికి చెందిన రాజేష్‌, లావణ్యలకు ఓ కుమార్తె, కుమారుడు. ఐదేళ్ల శాన్వి(5) గుండి గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతోంది. ఆదివారం పెద్దనాన్న ఇంటి వద్ద ఆడుకుంటోంది. పంటకు పిచికారీ చేయగా మిగిలిన క్రిమిసంహార మందును ఓ శీతల పానీయం సీసాలో నింపి అక్కడే ఉంచారు. ఆడుకుంటున్న పాప సీసా చూసి కూల్‌డ్రింక్‌ అనుకొని తాగింది. ఇంటికి వచ్చి వాంతులు చేసుకోవడం, వాసనను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కాగజ్‌నగర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి మంచిర్యాలకు పంపారు. అక్కడ పది ఆసుపత్రులు తిరిగినా నిరాకరణే ఎదురైంది.. చివరకు ఓ ఆసుపత్రిలో చూపించడంతో అప్పటికే మృతిచెందింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి అనూహ్యంగా కన్నుమూయడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని