నా కుమార్తెను వైద్యురాలిగా నియమించేందుకు రూ.లక్ష లంచం తీసుకున్నారు

జోగులాంబ గద్వాల ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వో డా.చందూనాయక్‌పై రాష్ట్ర సహకార వినియోగదారుల సమాఖ్య ఛైర్మన్‌ గట్టు తిమ్మప్ప చేసిన అవినీతి ఆరోపణలు సామాజిక

Published : 23 Sep 2022 04:29 IST

గద్వాల ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వోపై సహకార వినియోగదారుల సమాఖ్య ఛైర్మన్‌ ఆరోపణ

గద్వాల అర్బన్‌, న్యూస్‌టుడే: జోగులాంబ గద్వాల ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వో డా.చందూనాయక్‌పై రాష్ట్ర సహకార వినియోగదారుల సమాఖ్య ఛైర్మన్‌ గట్టు తిమ్మప్ప చేసిన అవినీతి ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో గురువారం హల్‌చల్‌ చేశాయి. తన కుమార్తెను వైద్యురాలిగా నియమించేందుకు రూ.లక్ష లంచం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై తిమ్మప్పను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా.. ఈ ఏడాది మే నెలలో ఒప్పంద పద్ధతిపై జిల్లాలోని పలు ఆసుపత్రులలో వైద్యుల నియామకం చేపట్టారని, మల్దకల్‌లో తన కుమార్తె ఒప్పంద వైద్యాధికారిగా విధుల్లో చేరారని తెలిపారు. అన్ని ధ్రువపత్రాలు ఉన్నప్పటికీ సరైన సర్టిఫికేట్లు లేవంటూ ఆమెను విధుల నుంచి తొలగిస్తానని తనను చందూనాయక్‌ బెదిరించారని ఆయన ఆరోపించారు. ఆయన తరఫున మధ్యవర్తులు వచ్చి తన భార్యను రూ.3 లక్షలు అడిగారని, చివరకు రూ.లక్ష తీసుకున్నారని తెలిపారు. తన కుమార్తెతోపాటు ఇతరుల వద్ద సైతం డబ్బులు వసూలు చేశారని తిమ్మప్ప ఆరోపించారు. డీఎంహెచ్‌వోపై మంత్రి హరీశ్‌రావుకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఈ విషయమై ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వో డా.చందూనాయక్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. తిమ్మప్పను తానెప్పుడూ చూడలేదన్నారు. మెరిట్‌ ఆధారంగానే వైద్యుల నియామకాలు జరిగాయని, ఆయన కుమార్తెను నియమించేందుకు డబ్బు వసూలు చేయలేదని స్పష్టంచేశారు. జిల్లాలో పలు ప్రైవేట్‌ ఆసుపత్రులు, నర్సింగ్‌హోంలు, క్లినిక్‌లను తనిఖీ చేసి అర్హత లేనివాటికి నోటీసులు జారీ చేశామని.. ఆ తనిఖీల ప్రభావమే తనపై ఆరోపణలకు కారణం కావచ్చని పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts