Crime News: రుణయాప్‌ల వేధింపులు.. ఎంసెట్‌ ర్యాంకర్‌ ఆత్మహత్య

రూ.పదివేల అప్పు పందొమ్మిదేళ్ల యువకుడిని బలిగొంది. ఎంసెట్‌లో 2వేల ర్యాంకు సాధించి..బీటెక్‌ కౌన్సెలింగ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చిన విద్యార్థి రుణయాప్‌ నిర్వాహకుల వేధింపులు

Updated : 24 Sep 2022 12:08 IST

శంషాబాద్‌, న్యూస్‌టుడే: రూ.పదివేల అప్పు పందొమ్మిదేళ్ల యువకుడిని బలిగొంది. ఎంసెట్‌లో 2వేల ర్యాంకు సాధించి..బీటెక్‌ కౌన్సెలింగ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చిన విద్యార్థి రుణయాప్‌ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉన్నత చదువులకు వెళ్లిన కుమారుడు విగతజీవిగా మారడంతో అతని తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఆర్జీఐఏ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం..కరీంనగర్‌ సమీప  నగునూర్‌కు చెందిన శ్రీధర్‌, పద్మ దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ కుమార్తె, కుమారుడు మునిసాయి (19)లను చదివిస్తున్నారు. ఇటీవల ఎంసెట్‌లో అతను రెండువేల ర్యాంకు సాధించాడు. బీటెక్‌ కౌన్సెలింగ్‌ నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి శంషాబాద్‌లోని స్నేహితుడి గదిలో ఉంటున్నాడు. వ్యక్తిగత ఖర్చుల కోసం ఎం-ప్యాకెట్‌, ధని యాప్‌లలో నాలుగు నెలల క్రితం రూ.10వేల రుణం తీసుకున్నాడు. జరిమానాల పేరిట యాప్‌ల నిర్వాహకులు భయపెట్టి ఇప్పటికే రూ.45వేలు వసూలు చేశారు. మరో రూ.15వేలు చెల్లించాలని తీవ్రంగా బెదిరించారు. సోషల్‌ మీడియాలో పెడతామని హెచ్చరించడంతో పరువు పోతుందని మనస్తాపంతో మునిసాయి ఈనెల 20న పురుగుల మందు తాగాడు. స్థానికులు అతణ్ని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుమారుడిని బతికించుకోవడానికి రూ.3 లక్షలకు పైగా ఖర్చు చేసినా ప్రాణాలు దక్కలేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని