డ్రగ్‌ మాఫియా డాన్‌ స్టీఫెన్‌ అరెస్ట్‌

జాన్‌ స్టీఫెన్‌ డిసౌజా అలియాస్‌ స్టీవ్‌ (60).. గోవా కేంద్రంగా సాగే మాదకద్రవ్యాల దందా డాన్‌. నాలుగు దశాబ్దాలుగా అంతర్జాతీయ స్థాయిలో మత్తు

Published : 24 Sep 2022 04:55 IST

గోవాలో 40 ఏళ్లుగా మత్తు దందా

ఒంటిచేత్తో వ్యాపారాన్ని శాసిస్తున్న బడా స్మగ్లర్‌

ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే, నారాయణగూడ: జాన్‌ స్టీఫెన్‌ డిసౌజా అలియాస్‌ స్టీవ్‌ (60).. గోవా కేంద్రంగా సాగే మాదకద్రవ్యాల దందా డాన్‌. నాలుగు దశాబ్దాలుగా అంతర్జాతీయ స్థాయిలో మత్తు వ్యాపారాన్ని ఒంటిచేత్తో నడిపిస్తున్న సూత్రధారి. ఆ బడా స్మగ్లర్‌ను హైదరాబాద్‌ నార్కొటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌న్యూ), ఓయూ పోలీసులు సంయుక్తంగా చాకచక్యంగా అరెస్ట్‌చేసి నగరానికి తీసుకొచ్చారు. శుక్రవారం బషీర్‌బాగ్‌లోని నగర పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో హెచ్‌న్యూ, ఓయూ సీఐలు పి.రాజేష్‌, రమేష్‌నాయక్‌తో కలిసి హెచ్‌న్యూ డీసీపీ గుమ్మా చక్రవర్తి, మధ్యమండలం డీసీపీ సునీల్‌దత్‌లు వివరాలు వెల్లడించారు.

అతడి మాటే శాసనం
పోర్చుగీసు కుటుంబానికి చెందిన జాన్‌ స్టీఫెన్‌ డిసౌజా గోవాలోనే పుట్టి పెరిగాడు. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. గోవా బీచ్‌లలో ఎక్కడికి మత్తుపదార్థాలు చేరాలన్నా, దేశంలో ఏ మూలకు సరకు చేరవేయాలన్నా అతని ఆమోదం ఉండాల్సిందే. గోవాలో పేరున్న రెస్టారెంట్లలో ఒకటైన హిల్‌టాప్‌ హోటల,్ హిల్‌టాప్‌ పబ్‌ల యజమాని. 1983లో మత్తుపదార్థాలు చేరవేసే ఏజెంట్‌గా తన దందా మొదలుపెట్టాడు. ప్రస్తుతం కనుసైగతో మత్తు సామ్రాజ్యాన్ని శాసిస్తున్నాడు. రూ.కోట్ల ఆస్తిపాస్తులు సంపాదించాడు. బడా వ్యాపారులు, రాజకీయ నాయకులకు రూ.కోట్లలో అప్పులు ఇచ్చే స్థితికి చేరాడు. ఇతడి కింద వందలాది మంది ఏజెంట్లు ఉన్నారు. వీరి ద్వారానే గోవాలో.. ఏపీ, తెలంగాణలకు చెందిన వేలాది మంది యువకులు మాదక ద్రవ్యాలకు దగ్గరయ్యారు. ఎంతో మంది మత్తుపదార్థాలు సరఫరా చేసే సబ్‌ ఏజెంట్లుగా మారుతున్నారు.

ఏ కేసుల్లో చిక్కాడంటే..
ఈ ఏడాది ఆగస్టు 16న ప్రితేష్‌ నారాయణ బోర్కర్‌ హబ్సిగూడలో డ్రగ్స్‌ విక్రయిస్తుండగా హెచ్‌-న్యూ, ఓయూ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇతడి నుంచి సేకరించిన సమాచారంతో దేశవ్యాప్తంగా 600 మంది మత్తు కొనుగోలుదారులున్నట్లు గుర్తించారు. వీరికి మత్తు పదార్థాలు విక్రయించిన వారిలో స్టీవ్‌, మంజూరు అహ్మద్‌లు కీలక సూత్రధారులు. బోర్కర్‌ ఇచ్చిన సమాచారం మేరకు హెచ్‌-న్యూ, ఓయూ పోలీసులు కలిసి గోవాకు వెళ్లారు. గోవా పోలీసుల సహకారంతో స్టీవ్‌ను బుధవారం అరెస్ట్‌ చేశారు.

తప్పించుకునేందుకు నాటకాలు
గోవాలో చిక్కిన స్టీవ్‌ హైదరాబాద్‌కు రాకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. ట్రాన్సిట్‌ వారెంట్‌పై నగరానికి తీసుకొచ్చేందుకు హెచ్‌న్యూ పోలీసులు అక్కడి న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, కొవిడ్‌ సోకిందంటూ.. కళ్లు తిరిగి పడిపోయినట్టు న్యాయస్థానంలో నాటకమాడాడు. వైద్యపరీక్షలు జరిపాక పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు నిర్ధారణైంది. రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే డ్రామాలు ఆడతాడని భావించి పోలీసులు అతన్ని విమానంలో నగరానికి తీసుకొచ్చారు. డ్రగ్‌ డాన్‌ను  చాకచక్యంగా అరెస్ట్‌ చేసిన హెచ్‌న్యూ డీసీపీ గుమ్మా చక్రవర్తి, సీఐ రాజేష్‌, రమేష్‌నాయక్‌, అదనపు సీఐ ఎన్‌.శ్రీధర్‌, ఎస్సై జి.ఎస్‌.డానియేల్‌ బృందాన్ని నగర సీపీ సీవీ ఆనంద్‌ అభినందించారు.

మరో కేసులో ఇద్దరి అరెస్ట్‌
ఒక అంతర్జాతీయ, మరో జాతీయస్థాయి డ్రగ్‌ వ్యాపారులను హెచ్‌-న్యూ, లంగర్‌హౌస్‌ పోలీసులు సంయుక్తంగా ఇటీవల అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.2 లక్షల విలువ చేసే 17 గ్రాముల ఎండీఎంఏ, 2 సెల్‌ఫోన్లు, రూ.3 వేలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బెంగళూరులో ఉంటున్న ఘనా దేశానికి చెందిన ఆంథోని అలియాస్‌ మసావో (50) డ్రగ్స్‌ వ్యాపారం చేస్తున్నాడు. తరచూ హైదరాబాద్‌కు వచ్చి విక్రయిస్తుంటాడు. ఇదే తరహా దందాను పి.వీర శివాజీరెడ్డి, డి.సుమంత్‌ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇదివరకే శివాజీరెడ్డిని అరెస్టు చేశారు. అతనిచ్చిన సమాచారం మేరకు మసావో, సుమంత్‌లను పట్టుకున్నారు. సుమంత్‌ నెల్లూరు కేంద్రంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని