పరువు పోతుందని ఆత్మహత్యాయత్నం

ఏలూరు జిల్లా పెదవేగి మండలం వేగివాడలో పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లీకుమార్తె మృతి చెందినట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. పోలీసులు తెలిపిన

Updated : 25 Sep 2022 05:40 IST

చికిత్స పొందుతూ తల్లీకుమార్తెల మృతి

పెదవేగి, న్యూస్‌టుడే: ఏలూరు జిల్లా పెదవేగి మండలం వేగివాడలో పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లీకుమార్తె మృతి చెందినట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వేగివాడకు చెందిన బాలిక (17) పదో తరగతి చదివి ఇంటి వద్ద ఉంటోంది. ఆమెకు దెందులూరు మండలం కొత్తపల్లికి చెందిన తాపీ పనులకు వెళ్లే యువకుడు కాట్రు చిట్టిబాబు పరిచయమయ్యాడు. అతడు ఈనెల 12న బాలికకు మాయమాటలు చెప్పి ద్విచక్రవాహనంపై ఏలూరుకు తీసుకెళ్లాడు. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న ఫొటోలు తీశాడు. విషయం బయటకు చెబితే ఫొటోలను గ్రామంలోని యువకులకు చూపిస్తానని బెదిరించాడు. 13వ తేదీ సాయంత్రం ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. విషయం గ్రామస్థులకు తెలిస్తే ఎక్కడ పరువు పోతుందోనని ఆందోళనకు గురై తల్లీకుమార్తె 16వ తేదీన ఇంటి వద్ద కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని తాగారు. గమనించి కుటుంబీకులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి, అక్కడినుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక శుక్రవారం మధ్యాహ్నం, తల్లి శనివారం ఉదయం చనిపోయారు. మృతుల రక్తసంబంధీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసుల నిర్లక్ష్యం వల్లే..: ‘ఈ సంఘటనపై పెదవేగి పోలీసులకు ఈ నెల 13న ఫిర్యాదు చేశాం. తరువాత మాట్లాడదామని ఎస్సై సత్యనారాయణ చెప్పారు. అప్పటినుంచి చిట్టిబాబుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని మృతుల సంబంధీకులు ఆరోపించారు. బాలిక చనిపోయాక పోక్సో కేసు నమోదు చేశారని, ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే వారు బలయ్యారని ఆరోపించారు. ఫిర్యాదు చేసింది వాస్తవమేనని, తాము కూర్చుని మాట్లాడుకుంటామని చెప్పి వెళ్లారని ఎస్సై సత్యనారాయణ వివరణ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని