దేశంలో ఆపరేషన్‌ మేఘచక్ర

చిన్నారులపై లైంగిక వేధింపులు, ఆన్‌లైన్‌లో వారి అశ్లీల చిత్రాలు వ్యాప్తి చేస్తున్న వారే లక్ష్యంగా సీబీఐ దేశవ్యాప్తంగా విస్తృత దాడులు నిర్వహించింది. ‘ఆపరేషన్‌ మేఘచక్ర’ పేరుతో 21

Updated : 25 Sep 2022 05:39 IST

చిన్నారుల అశ్లీల చిత్రాలు వ్యాప్తి చేస్తున్న వారిపై సీబీఐ పంజా

21 రాష్ట్రాల్లోని 59 స్థావరాల్లో సోదాలు

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో దాడులు

ఈనాడు, దిల్లీ, అమరావతి: చిన్నారులపై లైంగిక వేధింపులు, ఆన్‌లైన్‌లో వారి అశ్లీల చిత్రాలు వ్యాప్తి చేస్తున్న వారే లక్ష్యంగా సీబీఐ దేశవ్యాప్తంగా విస్తృత దాడులు నిర్వహించింది. ‘ఆపరేషన్‌ మేఘచక్ర’ పేరుతో 21 రాష్ట్రాల్లోని 59 స్థావరాల్లో సోదాలు చేసినట్లు సీబీఐ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. సింగపూర్‌లోని ఇంటర్‌పోల్‌ యూనిట్‌, న్యూజిలాండ్‌ పోలీసుల నుంచి అందిన సమాచారం మేరకు ఈ ఆపరేషన్‌ చేపట్టింది. తెలంగాణలో హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు, కృష్ణా జిల్లాలతో పాటు హరియాణా, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, కర్ణాటక, పంజాబ్‌, తమిళనాడు, గోవా, రాజస్థాన్‌, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌, బిహార్‌, త్రిపుర, హిమాచల్‌ప్రదేశ్‌ల్లోని నగరాల్లో ఎక్కువ సోదాలు నిర్వహించింది. పిల్లల అశ్లీల చిత్రాలు డౌన్‌లోడ్‌, షేర్‌ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసింది. చిన్నారుల అశ్లీల చిత్రాల చలామణి రాకెట్‌లో భారతీయ పౌరుల పాత్ర ఉన్నట్లు ఆ రెండు దేశాల నుంచి అందిన సమాచారం ఆధారంగా సీబీఐ ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల ప్రకారం 2 కేసులు నమోదు చేసింది. క్లౌడ్‌ ఆధారిత స్టోరేజ్‌ను ఉపయోగించి ఆ చిత్రాలు షేర్‌ కాకుండా, డౌన్‌లోడ్‌, ట్రాన్స్‌మిషన్‌ చేయకుండా అడ్డుకొనే ప్రయత్నం చేసింది. ఈ రాకెట్‌లో ఉన్న నిందితులను గుర్తించి, వారి వద్ద ఉన్న చిత్రాలు మరింత మందికి చేరకుండా చర్యలు తీసుకొంది. ఈ సోదాల సందర్భంగా 50 మంది అనుమానితుల నుంచి మొబైల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకుంది. ఫోరెన్సిక్‌ పరికరాల ద్వారా వాటిని విశ్లేషించినప్పుడు అందులో భారీ మొత్తంలో చిన్నారుల అశ్లీల చిత్రాలున్నట్లు తేలింది. అదుపులోకి తీసుకున్న వారిని ప్రశ్నించి బాధిత చిన్నారులు, వారిని వేధిస్తున్న నిందితులను గుర్తించే పని మొదలుపెట్టారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని