నేరం.. నిఘా ఘోరం!

ఇంట్లోకి చొరబడి మరీ అఘాయిత్యానికి పాల్పడి అంతమొందిస్తున్నారు.. బయటికొస్తే ఈడ్చుకెళ్లి లైంగిక దాడి చేసి చంపేస్తున్నారు. పక్కనే భర్త ఉన్నా సరే అతన్ని కట్టేసి, కొట్టేసి సామూహిక అత్యాచారానికి తెగబడుతున్నారు. పిల్లల ఎదుటే అకృత్యానికి ఒడిగడుతున్నారు.

Updated : 27 Sep 2022 05:53 IST

మహిళలపై అఘాయిత్యాలు.. హత్యలు
నేరగాళ్ల విచ్చలవిడితనం  
అధికార పార్టీ సేవలో తరిస్తున్న పోలీసులు  
ఈనాడు - అమరావతి

ఇంట్లోకి చొరబడి మరీ అఘాయిత్యానికి పాల్పడి అంతమొందిస్తున్నారు.. బయటికొస్తే ఈడ్చుకెళ్లి లైంగిక దాడి చేసి చంపేస్తున్నారు. పక్కనే భర్త ఉన్నా సరే అతన్ని కట్టేసి, కొట్టేసి సామూహిక అత్యాచారానికి తెగబడుతున్నారు. పిల్లల ఎదుటే అకృత్యానికి ఒడిగడుతున్నారు. ఒకటా.. రెండా! ఇలాంటి అత్యంత హేయమైన ఘటనలు వరసగా జరుగుతున్నా పోలీసులకు ఏ మాత్రం పట్టడం లేదు. వారంతా వాటి నియంత్రణ తమ పనే కాదన్నట్లుగా నిస్తేజంగా ఉంటున్నారు. అధికార వైకాపా సేవలో తరించటం, ఆ పార్టీ నాయకులు చెప్పిన దానికల్లా తలాడిస్తూ వారి రాజకీయ ప్రత్యర్థులు, గిట్టని వారిపై తప్పుడు కేసులతో వేధింపులకు పాల్పడటం, అణచివేయటం పైనే వారి దృష్టి ఉంటోంది. అవి తప్ప నేర నియంత్రణ గురించి పట్టింపే లేదు. అరాచక శక్తులపై ఉక్కుపాదం మోపాలనే శ్రద్ధ లేదు. దీంతో అసాంఘిక శక్తుల్లో భయమే లేకుండా పోతోంది. విచ్చలవిడితనం పెరుగుతోంది. ఏం చేసినా ఎవరూ ఏమీ చేయలేరులే అనే ధోరణి అధికమవుతోంది. వీటన్నింటి ఫలితమే రాష్ట్రంలో ‘హత్యా’చారాలు (అత్యాచారానికి పాల్పడి చంపేస్తున్న దారుణాలు) ఎక్కువవుతున్నాయి.

సీఎం నివాసానికి సమీపంలోనే అత్యాచారం
*
ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ నివాసానికి కిలోమీటరున్నర దూరంలో ఉన్న సీతానగరం పుష్కరఘాట్‌ వద్ద ఎస్సీ యువతిపై సామూహిక అత్యాచారం ఘటన జరిగి 15 నెలలు అవుతోంది. గతేడాది జూన్‌ 19న ఈ ఘటన జరగ్గా.. దాదాపు 2 నెలల పాటు నిందితులను పట్టుకోలేకపోయారు. చివరికి ఆగస్టు 7న ప్రధాన నిందితుడు శేరు కృష్ణకిషోర్‌, మూడో నిందితుడు షేక్‌ హబీబ్‌ను అరెస్టు చేశారు. రెండో నిందితుడు వెంకటరెడ్డిని ఇప్పటికీ పట్టుకోలేదు.
* గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు సమీపంలో ఓ వివాహితపై గతేడాది సెప్టెంబరు 8న కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఓ శుభకార్యానికి వెళ్లి భర్తతో కలిసి వస్తుండగా రాత్రివేళ అడ్డగించి అఘాయిత్యం చేశారు. భార్యభర్తలిద్దరినీ కొట్టి చిత్రహింసలు పాల్జేశారు. బెదిరించి ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ ఘటన జరిగి ఏడాది దాటిపోయినా రెండో నిందితుడు సుంకన్నను పోలీసులు ఇప్పటికీ అరెస్టు చేయలేకపోయారు.
* ఈ రెండు కేసుల్లోనూ పరారీలో ఉన్న ఇద్దరు నిందితులకూ నేర చరిత్ర ఉంది. అయినా పోలీసులు వారిని కనిపెట్టలేకపోయారు. ప్రస్తుతం బయట తిరుగుతున్నవారు ఇలాంటి మరిన్ని నేరాలకు, అఘాయిత్యాలకు పాల్పడితే బాధ్యులెవరు? పోలీసులు కాదా?

మత్తులో జోగుతున్న పాతికేళ్ల ప్రాయం..  
* రాష్ట్రంలో గత నాలుగైదు నెలల్లో సంచలనమైన పలు సామూహిక అత్యాచార ఘటనల్ని పరిశీలిస్తే వాటిల్లో నిందితులుగా ఉన్న వారంతా 21 నుంచి 25 ఏళ్లలోపు వయసువారే. అఘాయిత్యానికి పాల్పడిన సమయంలో వారంతా మద్యం మత్తులో ఉన్నారు. చెడు సావాసాలు, దురలవాట్లకు లోనై నేరాల వైపు మళ్లుతున్నారు. క్రమంగా అసాంఘిక శక్తుల్లా మారుతున్నారు. అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. గ్రామాల్లో ఇలాంటి వారిని ముందే గుర్తించటం, వారి కదలికలపై నిఘా ఉంచటం, నేరానికి పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించటం వంటి వాటిని పోలీసులు పట్టించుకోవట్లేదు. దీంతో నిందితుల్లో భయం ఉండట్లేదు.  
* మాచర్ల మండలంలో గిరిజన మహిళలపై సామూహిక అత్యాచారం, హత్యకు పాల్పడ్డ నిందితులు.. గతంలో వెల్దుర్తి మండలంలో ఓ మహిళపై ఇదే తరహాలో అత్యాచారానికి పాల్పడి, హత్య చేశారన్న ఆరోపణలున్నాయి. అప్పట్లోనే పోలీసులు కఠినంగా వ్యవహరించి ఉంటే తాజా ఘోరం చోటుచేసుకునే అవకాశం ఉండేది కాదు.
* అచ్యుతాపురం సెజ్‌లో గిరిజన మహిళ ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారానికి పాల్పడి చంపేసిన ఘటనలో నిందితుడు మద్యం మత్తులో ఆ దారుణానికి ఒడిగట్టాడు.
* రేపల్లె రైల్వేస్టేషన్‌లో భర్త, పిల్లలతో ఉన్న గర్భిణిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులూ మద్యం మైకంలోనే ఉన్నారు.
* రాష్ట్రంలో మద్యం, గంజాయి విచ్చలవిడిగా లభించటం, వాటి వినియోగం పెరగటం ఈ లైంగిక నేరాలకు కారణమవుతోంది. పోలీసులు అలాంటి వాటిపై చర్యలు తీసుకుంటున్న పరిస్థితి లేదు.

చంపేస్తున్నా.. పోలీసులకు పట్టదా?
* రాష్ట్రంలో గత నాలుగైదు నెలల్లో జరిగిన అత్యాచార ఉదంతాలు విశ్లేషిస్తే అఘాయిత్యానికి పాల్పడుతున్న నిందితులు.. బాధితులు ఎదురుతిరిగితే వారిని చంపేస్తున్నారు. కొన్ని ఘటనల్లో అయితే ఏకంగా ఇంట్లోకి చొరబడి మరీ చంపుతున్నారు. అయినా పోలీసులకు మాత్రం ఇవేవి పట్టట్లేదు. ఆ ఫలితంగానే అలాంటి ఘటనలే పునరావృతమవుతున్నాయి.
* గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడికి చెందిన వీరంకి శ్రీలక్ష్మీ తిరుపతమ్మ (34) ఇంట్లో ఉండగా.. కొంతమంది వ్యక్తులు ఇంట్లోకి చొరబడి మరీ ఆమెపై అత్యాచారానికి యత్నించారు. ఆమె ప్రతిఘటించటంతో గొంతుకు చీర కొంగు బిగించి చంపేశారు.
* శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలానికి చెందిన ఓ బాలింత బహిర్భూమికి వెళ్లగా.. కొందరు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రతిఘటించటంతో ఆమెను బండరాళ్లతో తలపై మోది చంపేశారు.
* తాజాగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, పల్నాడు జిల్లా మాచర్లలో ఇద్దరు గిరిజన మహిళలపై అత్యాచారం చేసి, వారు ప్రతిఘటించటంతో దారుణంగా చంపేశారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని