వీడియో ఆటల పేరుతో టోకరా

మొబైల్‌ గేమ్స్‌ పేరుతో మైనర్ల నుంచి వారికి తెలియకుండానే పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేసి విదేశాలకు తరలిస్తున్న కోడా పేమెంట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (సీపీఐపీఎల్‌)

Updated : 28 Sep 2022 05:29 IST

రూ.2 వేల కోట్లకుపైగా దేశం దాటించిన వైనం

కోడా పేమెంట్స్‌ సంస్థలో జరిపిన సోదాల్లో గుర్తించిన ఈడీ

ఈనాడు, హైదరాబాద్‌: మొబైల్‌ గేమ్స్‌ పేరుతో మైనర్ల నుంచి వారికి తెలియకుండానే పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేసి విదేశాలకు తరలిస్తున్న కోడా పేమెంట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (సీపీఐపీఎల్‌) సంస్థలో హైదరాబాద్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. సంస్థ ఖాతాల్లో ఉన్న రూ.68.53 కోట్ల నగదు నిల్వలను స్తంభింపజేశారు. కోడా పేమెంట్స్‌ సంస్థ గరెనా ఫ్రీ ఫైర్‌, టీన్‌ పత్తి గోల్డ్‌, కాల్‌ ఆఫ్‌ డ్యూటీ వంటి వీడియో ఆటలు నిర్వహిస్తూ వాటిలో పాల్గొన్న వారి నుంచి డబ్బు వసూలు చేస్తోంది. వీడియో ఆటల పేర్లతో మైనర్లను ఆకట్టుకునేది. ఆటలోకి దిగాక తెలియకుండానే వారి ఖాతాల నుంచి డిజిటల్‌ టోకెన్ల అమ్మకం పేరుతో డబ్బు కొల్లగొట్టేది. ఒకసారి వీడియో గేమ్‌ విజయవంతంగా ఆడాక మొబైల్‌ఫోన్‌పై పాప్‌ అప్‌ కనిపిస్తుంది. తదుపరి లావాదేవీలకు అనుమతి ఇవ్వాలని అందులో కనిపిస్తుంది. గేమ్‌ ఆడాలన్న తొందరలో దానికి ఓకే చెప్పగానే ఇక వారి ప్రమేయం లేకుండానే ఖాతాల్లో డబ్బు మాయమవుతుంటుంది. ఉద్దేశపూర్వకంగానే సీపీఐపీఎల్‌ సంస్థ వీడియో ఆటల విధానాన్ని ఇలా పకడ్బందీగా రూపొందించింది. సింగపూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న కోడా పేమెంట్స్‌ సింగపూర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ తరఫున ప్రతినిధిగా డబ్బు వసూలుచేసి ఆ ఖాతాలో జమ చేయడమే తమ పని అని సీపీఐపీఎల్‌ పేర్కొంది. ఇప్పటి వరకూ ఈ సంస్థ దేశంలో రూ.2,850 కోట్లు వసూలు చేసినట్లు.. పన్నులు, లాభాల పేరుతో కొంత ఉంచుకొని రూ.2,265 కోట్లు విదేశాలకు తరలించినట్లు ఈడీ గుర్తించింది. ఈ సంస్థకు చెందిన ఖాతాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పేమెంట్‌ గేట్‌వేలకు సంబంధించిన యూజర్‌ఐడీలు అన్నింటినీ ఈడీ అధికారులు జప్తు చేశారు.

సైబరాబాద్‌ కేసు ఆధారంగా దర్యాప్తు
జాతీయ పోలీసు అకాడమీలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఓ అధికారి, ఆయన కుమార్తె ఖాతా నుంచి ఏకంగా రూ.11.50 లక్షలు మాయమయ్యాయి. దీనిపై ఆయన 2021 సెప్టెంబరులో సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ డబ్బంతా కోడా పేమెంట్‌కు సంబంధించిన ముంబయి ఖాతాల్లో జమ అయినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడి మనవడు వీడియో ఆటలు ఆడినట్లు, దానికి చెల్లింపుల్లో భాగంగానే ఖాతాలు ఖాళీ అయినట్లు తేలింది. పోలీసులు కోడా పేమెంట్స్‌ గేట్‌వేకు చెందిన సింగపూర్‌లోని దాని మాతృసంస్థను సంప్రదించి డబ్బును రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఈ ఫిర్యాదుతో పాటు దేశవ్యాప్తంగా సీపీఐపీఎల్‌పై అనేక కేసులు నమోదయ్యాయి. వీడియో ఆటల పేరుతో అనధికారికంగా డబ్బు వసూలు చేసి విదేశాలకు తరలిస్తున్న నేరంపై హైదరాబాద్‌ ఈడీ కేసు నమోదు చేసి దేశవ్యాప్తంగా హైదరాబాద్‌, చెన్నై, ముంబయిలలో సోదాలు నిర్వహించింది.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని