భూవివాదంలో ఒకరి హత్య

రెండు కుటుంబాల మధ్య రాజుకున్న భూ వివాదం ఒకరి హత్యకు దారితీసింది. ఈ ఘటన జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నేలపోగుల గ్రామంలో మంగళవారం

Published : 28 Sep 2022 04:41 IST

సర్పంచే కారణమంటూ సెల్ఫీ వీడియోలో నిందితుడి ఆరోపణ

లింగాలఘనపురం, న్యూస్‌టుడే: రెండు కుటుంబాల మధ్య రాజుకున్న భూ వివాదం ఒకరి హత్యకు దారితీసింది. ఈ ఘటన జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నేలపోగుల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం.. నేలపోగుల గ్రామానికి చెందిన బొబ్బాల రవీందర్‌ అలియాస్‌ రవి(38) భార్యాపిల్లలతో కలిసి హనుమకొండలో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా రవీందర్‌, కందగట్ల భాస్కర్‌ మధ్య 20 గుంటల భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. నేలపోగులలో వీరిద్దరి పొలాలు పక్కపక్కనే ఉంటాయి. దస్త్రాల ప్రకారం ఆ 20 గుంటల భూమి తనకే చెందుతుందని భాస్కర్‌, పట్టాదారు పాసుపుస్తకం ప్రకారం తనదేేనంటూ రవీందర్‌ చెబుతున్నారు. గ్రామపెద్దలను ఆశ్రయించగా.. దసరా అనంతరం తేల్చుతామని చెప్పారు. ఈలోగా రవీందర్‌ 16 గుంటల భూమిని రియల్టర్లకు అమ్మేశారు. మంగళవారం ఆ భూమి చుట్టూ ఇనుప కంచె పాతిస్తున్నారు. దీనికి భాస్కర్‌ అడ్డుతగలడంతో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో భాస్కర్‌ గడ్డపారతో రవీందర్‌ తలపై కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం భాస్కర్‌ సెల్ఫీ వీడియోలో మాట్లాడారు. ‘ఈ రోజు జరిగిన దురదృష్ట సంఘటన చేయడానికి కారణం సర్పంచి దూసరి గణపతి. రవీందర్‌ నా భూమిలోని పెసర చేలో కనీలు(కంచె) పాతుతుండగా అడ్డగించాను. నాపై దాడి చేయబోగా ఆత్మరక్షణ కోసం ఆ విధంగా చేశాను. రోడ్డుకు పోయిన భూమిని రికార్డుల ఆధారంగా తీసుకుని అమ్మారు. అమ్మిన భూమికి తలా కొన్ని డబ్బులు పంచుకున్నారు. నన్ను, నా కుటుంబాన్ని ఆగం చేస్తున్నారు. దీనికి కారకుడు నేలపోగుల సర్పంచి, ఆయనకు సహకరిస్తున్న సంపత్‌, సోమయ్యలు’ అని అందులో భాస్కర్‌ ఆరోపించారు. ఇది సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది. రవీందర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడు పరారీలో ఉన్నాడని ఎస్సై రఘుపతి తెలిపారు.

* భూవివాదంలో న్యాయంగా మాట్లాడినందుకు తనపై భాస్కర్‌ ఆరోపణలు చేశారని నేలపోగుల సర్పంచి గణపతి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. భాస్కర్‌కు గతంలోనూ నేర చరిత్ర ఉందని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని