దొంగల దాడికి ఎదురొడ్డిన పోలీసులు

ఆవుల దొంగల ముఠాలోని ఓ సభ్యుడిని కామారెడ్డి జిల్లా మద్నూర్‌ పోలీసులు 50 కి.మీ. దూరం వెంటాడి పట్టుకున్నారు. వారి దాడులకు ఎదురొడ్డుతూ సినీఫక్కీలో జరిగిన ఛేజింగ్‌

Published : 28 Sep 2022 05:30 IST

ఆరు రౌండ్ల కాల్పులు జరిపిన ఎస్సై

ఆవుల అపహరణ ముఠా సభ్యుడి అరెస్టు

50 కిలోమీటర్లు వెంటాడిన వైనం

మద్నూర్‌, న్యూస్‌టుడే: ఆవుల దొంగల ముఠాలోని ఓ సభ్యుడిని కామారెడ్డి జిల్లా మద్నూర్‌ పోలీసులు 50 కి.మీ. దూరం వెంటాడి పట్టుకున్నారు. వారి దాడులకు ఎదురొడ్డుతూ సినీఫక్కీలో జరిగిన ఛేజింగ్‌ వివరాలను ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. రెండు రోజుల క్రితం మద్నూర్‌ మండలం పెద్దఎక్లారలో ఒకటి, జుక్కల్‌ మండల పరిధిలో రెండు ఆవులు చోరీకి గురయ్యాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దొంగల వాహనాన్ని గుర్తించి, వారిని పట్టుకునేందుకు బృందాలు ఏర్పాటుచేశారు.

సోమవారం అర్ధరాత్రి మద్నూర్‌ సోనాల బ్రిడ్జి వద్ద పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా ఓ వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. పరిశీలించేందుకు వెళ్లిన ఇద్దరు పోలీసులపై దుండగులు రాళ్లదాడి చేసి, పెద్దతడ్గూర్‌ మార్గంలో పరారయ్యారు. వెంటనే సిబ్బంది మద్నూర్‌ ఎస్సై శివకుమార్‌కు సమాచారమిచ్చి, అంతా కలసి దుండగుల వాహనాన్ని వెంబడించారు.. బిచ్కుంద సీఐతో పాటు, మహారాష్ట్రలోని దెగ్లూర్‌, మర్కల్‌ పోలీసులకూ ఉప్పందించారు. దుండగులు రాళ్లు రువ్వుతూనే మద్నూర్‌ వైపు పారిపోయారు.
మద్నూర్‌లోని పెద్దతడ్గూర్‌ చౌరస్తా వద్ద దొంగలు ఆగి, వెంటాడుతూ వస్తున్న ఎస్సై శివకుమార్‌ వాహనాన్ని ఢీకొన్నారు. ఆయన సర్వీస్‌ రివాల్వర్‌తో ఆరురౌండ్లు కాల్పులు జరపగా.. దుండగులు మహారాష్ట్రకు పారిపోయారు. మర్కల్‌ పరిధిలో అక్కడి పోలీసులు రోడ్డుపై కర్రలు అడ్డుపెట్టినా తప్పించుకున్నారు. చివరగా హనేగావ్‌ మార్గంలో రెండు కంటైనర్లు అడ్డుపెట్టి, అతికష్టం మీద ముఠాలోని ఓ సభ్యుడిని పట్టుకున్నారు.

హరియాణాకు చెందినవారిగా గుర్తింపు
పట్టుబడిన దుండగుడిని హరియాణాకు చెందిన హర్షద్‌గా గుర్తించారు. విచారణలో వారి నాయకుడు షబ్బీర్‌ అని, మొత్తం ఏడుగురు సభ్యులున్న ముఠా.. ఆవులను అపహరిస్తూ, పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. త్వరలో మిగతా నిందితులను పట్టుకుంటామన్నారు. ధైర్యంగా దొంగలను వెంబడించిన ఎస్సై శివకుమార్‌, సిబ్బందిని అభినందిస్తూ ఎస్సైకి రూ.పదివేల రివార్డు అందించారు. విలేకరుల సమావేశంలో బిచ్కుంద సీఐ కృష్ణ, కామారెడ్డి సీసీఎస్‌ సీఐ మల్లేశ్‌గౌడ్‌, దెగ్లూర్‌ ఎస్సై సోహన్‌, మర్కల్‌ ఎస్సై విష్ణు ఉన్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని