తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో మహిళారైతు ఆత్మహత్యాయత్నం

తన కుటుంబసభ్యుల పేరిట ఉన్న భూమిని రెవెన్యూ అధికారులు అక్రమంగా ఇతరులకు పట్టా చేశారని ఆరోపిస్తూ ఓ మహిళారైతు మంగళవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి రెవెన్యూ కార్యాలయ

Published : 28 Sep 2022 04:41 IST

బెజ్జంకి, న్యూస్‌టుడే: తన కుటుంబసభ్యుల పేరిట ఉన్న భూమిని రెవెన్యూ అధికారులు అక్రమంగా ఇతరులకు పట్టా చేశారని ఆరోపిస్తూ ఓ మహిళారైతు మంగళవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి రెవెన్యూ కార్యాలయ ఆవరణలో ఆత్మహత్యకు యత్నించారు. ఇదే జిల్లా దాచారానికి చెందిన గాజె మల్లేశానికి సర్వే నంబరు 568/2బీలో 39 గుంటల వ్యవసాయ భూమి.. తాత  గాజె కర్రె మల్లయ్య పేరిట పట్టా ఉంది. ఏళ్లుగా వీరు కాస్తు చేస్తూ అనుభవదారులుగా ఉన్నారు. మల్లేశం ఎలాంటి అమ్మకం చేయకుండానే 2000 సంవత్సరంలో పహాణీలో మరొకరి పేరు నమోదైంది. 2014 నుంచి ఆన్‌లైన్‌లో ఈ భూమి వివరాలు కనిపించడం లేదు. అనంతరం ప్రభుత్వం జారీ చేసిన నూతన పాసు పుస్తకంలో ఇదే గ్రామానికి చెందిన మరొకరి పేరు వచ్చింది. సర్వే నంబరూ మారింది. తమ భూమికి నంబర్లు, పేర్లు మారుతున్న తీరుపై మూడేళ్ల నుంచి మల్లేశం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దంపతులిద్దరూ మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చారు. కొద్ది సేపటికే భాగ్యలక్ష్మి పురుగుల మందు తాగారు. ఆమెను స్థానికులు కరీంనగర్‌ ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. దీనిపై తహసీల్దార్‌ విజయప్రకాశ్‌రావు వివరణ కోరగా.. 568, 569 సర్వే నంబర్లలో గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములు ఉన్నాయన్నారు. సంబంధిత దస్త్రాలు కార్యాలయంలో అందుబాటులో లేవన్నారు. ఆ సర్వే నంబర్లలోని భూమిపై పలు రిజిస్ట్రేషన్లు జరిగిన మాట వాస్తవమేనని, ఆ సమయంలో తాను సెలవులో ఉన్నట్లు పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో విచారించి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని