ఆరు హత్యల్లో వాంటెడ్‌

సుదీర్ఘకాలంగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న మాజీ నక్సలైట్‌, గ్యాంగ్‌స్టర్‌ నయీం అనుచరుడు మద్దునూరి శేషయ్య అలియాస్‌ శేషన్న ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గోల్కొండ

Published : 28 Sep 2022 06:47 IST

గ్యాంగ్‌స్టర్‌ నయీం అనుచరుడు శేషన్న అరెస్ట్‌

ఆయుధంతో సంచరిస్తూ చిక్కిన మాజీ నక్సలైట్‌

ఈనాడు, హైదరాబాద్‌: సుదీర్ఘకాలంగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న మాజీ నక్సలైట్‌, గ్యాంగ్‌స్టర్‌ నయీం అనుచరుడు మద్దునూరి శేషయ్య అలియాస్‌ శేషన్న ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గోల్కొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని షేక్‌పేట క్రాస్‌రోడ్డులో మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో వాహన తనిఖీల్లో శేషన్న చిక్కినట్లు పోలీసులు ప్రకటించారు. ఆయన వద్ద 9 ఎంఎం పిస్టల్‌, 5 తూటాలు లభించినట్లు వెల్లడించారు హైదరాబాద్‌ బీఎన్‌రెడ్డి నగర్‌లోని చైతన్యనగర్‌ కాలనీలో ఉంటూ స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట ప్రాంతానికి చెందిన శేషన్న పదో తరగతి చదువుతుండగానే నక్సలైట్‌ ఉద్యమానికి ఆకర్షితుడయ్యాడు. 1993లో సనత్‌నగర్‌ ఠాణా పరిధిలో టాడా కేసులో అరెస్టయ్యాడు. అనంతరం మాజీ ఐపీఎస్‌ కేఎస్‌ వ్యాస్‌ హత్య కేసులో పీటీవారెంట్‌పై పోలీసులు ఆయనను జైలుకు పంపగా.. అక్కడ కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ నయీంతో శేషన్నకు అనుబంధం పెరిగింది. నక్సల్‌ ఉద్యమంలో ఉండగానే నయీంతో పరిచయమున్నా, జైలు అనుంబంధం వారిని మరింత దగ్గర చేసింది. బెయిల్‌పై బయటికి వచ్చాక ఇద్దరూ కలిసి పెద్దఎత్తున దందాలు చేశారు. అచ్చంపేటలో 2004లో రాములు, ఉట్కూర్‌లో 2005లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు కనకాచారి, హైదరాబాద్‌ సుల్తాన్‌బజార్‌ ఠాణా పరిధిలో 2011లో మాజీ నక్సలైట్‌ పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి, పహాడీషరీఫ్‌లో శ్రీధర్‌రెడ్డి, 2013లో అచ్చంపేటలో శ్రీనివాస్‌రావు, 2014లో నల్గొండ పట్టణంలో కోనాపురం రాములు హత్య కేసుల్లో శేషన్న నిందితుడిగా ఉన్నాడు. ఈ హత్యలు చాలావరకు నయీం ప్రోద్బలంతోనే జరిగాయి. ఆయుధ చట్టం కింద శేషన్నపై మరో 3 కేసులు నమోదయ్యాయి.

నయీం ఎన్‌కౌంటర్‌ జరిగిన సమయంలో శేషన్న సైతం పోలీసుల పరిశీలనలో ఉన్నాడంటూ ప్రచారం జరిగింది. ఆ సమయంలో శేషన్న అడవుల్లో, పొరుగు రాష్ట్రంలో తలదాచుకున్నాడనే వాదన వినిపించింది. అప్పటినుంచి దందాలకు దూరంగా ఉండటంతో పోలీసులు అతడిపై పెద్దగా దృష్టి సారించలేదు. ఇటీవల హైదరాబాద్‌ హుమాయూన్‌నగర్‌కు చెందిన ఓ మాజీ రౌడీషీటర్‌ను బెదిరించాలంటూ శేషన్న అదే ప్రాంతంలోని ఫస్ట్‌లాన్సర్‌కు చెందిన అబ్దుల్లాకు తుపాకీ ఇచ్చాడు. ఈ విషయం పోలీసులకు ఉప్పందడంతో అబ్దుల్లా ఇంట్లో సోదా చేసి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శేషన్న కదలికలపై నిఘా ఉంచడంతో ఎట్టకేలకు చిక్కాడు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని