పుట్టిన రోజే జల సమాధి

పుట్టినరోజున ఈత కొట్టేందుకు వెళ్లిన స్నేహితుల సరదా విషాదంగా మారింది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం నాట్కాన్‌ చెరువులో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు.

Updated : 29 Sep 2022 05:52 IST

 ఒకరి మృతదేహం లభ్యం.. ఇద్దరు స్నేహితుల గల్లంతు

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో ఘటన

ఈనాడు- హైదరాబాద్‌, కీసర, న్యూస్‌టుడే: పుట్టినరోజున ఈత కొట్టేందుకు వెళ్లిన స్నేహితుల సరదా విషాదంగా మారింది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం నాట్కాన్‌ చెరువులో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. దీంతో ఒకే కళాశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ చంపాపేట్‌కు చెందిన హుబేద్‌(18), అబ్దుల్లాపూర్‌మెట్‌ వాసి బాలాజీ(18), హయత్‌నగర్‌కు చెందిన హరిహరన్‌(18) మీర్‌పేట్‌లోని తీగల కృష్ణారెడ్డి కళాశాలలో డిప్లొమా మూడో సంవత్సరం చదువుతున్నారు. బుధవారం హుబేద్‌, హరిహరన్‌ల పుట్టినరోజు నేపథ్యంలో సరదాగా ఎక్కడికైనా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బాలాజీతో పాటు మరో ఆరుగురు స్నేహితులతో కలిసి మొత్తం తొమ్మిది మంది కీసర మండలం చీర్యాలలోని లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి వచ్చారు. దర్శనం తర్వాత పక్కనే ఉన్న నాట్కాన్‌ చెరువు దగ్గరకు వెళ్లారు. ఇటీవల వర్షాలకు చెరువు నీటితో కళకళలాడుతోంది. అందులో ఈత కొట్టేందుకు మొదట హుబేద్‌, బాలాజీ దిగారు. ఇద్దరికీ ఈత వచ్చు. దాదాపు 15 అడుగుల దూరం వెళ్లి కొద్దిసేపు కేరింతలు కొట్టారు. ఆ తర్వాత వెనకాల హరిహరన్‌ దిగాడు. ఇతనికి ఈత రాదు. ముగ్గురు నీటిలో కొద్దిసేపు సరదాగా కనిపించినా.. బాలాజీ ఒక్కసారిగా చేతులు పైకెత్తి మునిగిపోతున్నట్లు కనిపించాడు. వెంటనే హుబేద్‌ అతన్ని పట్టుకున్నాడు. కొద్ది క్షణాల్లోనే ఇద్దరూ మునిగిపోయారు. మరోవైపు చెరువులో పది అడుగుల దూరం వెళ్లిన హరిహరన్‌ ఒక్కసారిగా చేతులు పైకెత్తుతూ కేకలు వేస్తూ కనిపించాడు. కొద్దిసేపటికి అతనూ నీటిలో మునిగిపోయాడు. ఈ ఘటనను ఓ విద్యార్థి తన ఫోన్‌లో చిత్రీకరించాడు. హరిహరన్‌ మృతదేహాన్ని గజ ఈతగాళ్లు వెలికితీశారు. హుబేద్‌, బాలాజీల కోసం గాలిస్తున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని